calender_icon.png 19 May, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో అతి జాగ్రత్త

18-05-2025 10:25:12 PM

ఎంత పని చేసింది?!

ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త

భర్తకు తెలియకుండా ధాన్యం విక్రయించిన భార్య

లక్షన్నర పోగొట్టుకున్న వైనం

జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): భార్యకు తెలియకుండా ధాన్యం బస్తాలో భర్త డబ్బు దాచాడు. భర్త ధాన్యం బస్తాలో డబ్బు దాచిన విషయం తెలియక భార్య డబ్బులున్న ధాన్యం బస్తాను విక్రయించడంతో రూ.లక్షన్నర పోగొట్టుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ లో చోటుచేసుకుంది. గాంధీనగర్ గ్రామానికి చెందిన రైతు పోతరాజు వీరయ్య ఇటీవల తన ఎద్దులను అమ్మగా లక్షన్నర రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లో ఉన్న ఓ ధాన్యం బస్తాలో అతి జాగ్రత్తగా దాచిపెట్టాడు. అయితే ఈ విషయం భార్యకు చెప్పక పోవడంతో గత బుధవారం గ్రామానికి ఒక వ్యాపారి వాహనంతో విడి ధాన్యం కొనుగోలు చేయడానికి రాగా, వీరయ్య భార్య ఆ ధాన్యం బస్తాను ఆ వ్యాపారికి విక్రయించింది. కొద్ది సేపటికి పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన వీరయ్య ధాన్యం బస్తా కనిపించక ఆందోళన చెందాడు. భార్యను ప్రశ్నించగా ధాన్యం బస్తాను  విక్రయించినట్లు ఆమె తెలిపింది. దీనితో అందులో డబ్బు దాచిన విషయం చెప్పి గొల్లు మన్నాడు. వెంటనే వారు ఊరంతా ఆ వ్యాపారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీనితో డబ్బు కోల్పోయిన దంపతులు చివరికి శనివారం పోలీసులను ఆశ్రయించగా సిసి ఫుటేజ్ ఆధారంగా సదరు వ్యాపారి, వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయ్యో అతి జాగ్రత్త పడితే అసలు కే మోసం జరిగిందని వాపోతున్నారు.