30-08-2025 12:09:26 AM
జగిత్యాల అర్బన్, ఆగస్టు 29(విజయ క్రాంతి): భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు తో పాటు రు.2500 జరిమాన విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి శుక్రవారం కీలక తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయికల్ పట్టణానికి చెందిన అరిపల్లి సత్తయ్య, సుధారాణి భార్యా భర్తలు వీరికి ఇద్దరు కుమారులు. సత్తయ్య ఇంటి వద్ద ఉంటూ ఏ పని చేయకుండా నిత్యం భార్యను వేధిస్తూ ఉండేవాడని తెలిపారు.
ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతుండేవని,ఈ గొడవల కారణంగా సుధారాణి ఇంట్లో నుండి వెళ్లిపోయి వేరే దగ్గర కిరాయి ఉంటూ జీవనం కొనసాగిస్తూ తన కొడుకుల బాగోగులు చూసుకుంటూ ఉండేదన్నారు. ఇది నచ్చని సత్తయ్య సుధారాణి కిరాయి కి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవను సృష్టిస్తూ, ఎలాగైనా చంపుతానని బెదిరిస్తూ ఆమెను చేతితో కొట్టేవాడన్నారు. సుమారు 5 నెలల అనంతరం కిరాయి ఇంటిని ఖాలి చేసి తన సొంత ఇంట్లో భర్తతో వేరుగా ఉంటూ జీవనం సాగిస్తూ ఉండేదని తెలిపారు.
16 ఆగస్టు,2020 రోజున సాయంత్రం 4 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ కాగా సత్తయ్య సుధారాణిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో పదునైన ఆయుధంతో సుధారాణి గొంతు కోసి హత్య చేయడం జరిగిందన్నారు.మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్త్స్ర ఆరోగ్యం నిందితుని పై కేసు నమోదు చేయగా రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జీ షీట్ దాఖలు చేసి నిందితుడు సత్తయ్య ను కోర్టు లో హాజరుపరచారన్నారు.
సాక్షులను విచారించిన జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి నిందితునికి జీవిత ఖైదు తో పాటు రు.2500 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారని తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష నుండి తప్పించు కోలేరన్నారు. పోలిసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ చేపట్టి, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారన్నారు.ఈ కేస్ లో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీ.పీ మల్లికార్జున్, ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్, ఎస్.ఐ ఆరోగ్యం, సి ఎం ఎస్ ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ నరేష్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.