calender_icon.png 21 August, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్ కలెక్టర్ స్పెషల్ ఫోకస్!

21-08-2025 12:08:17 AM

-మంత్రి నియోజకవర్గం కావడంతో డెవలప్‌మెంట్‌పై దృష్టి

-నెలకోసారి ఆఫిసర్లతో రివ్యూ చేస్తూ పనులకు డెడ్ లైన్ విధింపు

హుస్నాబాద్, ఆగస్టు 20 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ హైమావతి ప్రత్యేక దృష్టి సారించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, నియోజకవర్గంలో అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ఆమె ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.

ఇందులో భాగంగా, నెలకోసారి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, ప్రతి పనికి కచ్చితమైన గడువులను నిర్దేశిస్తున్నారు. బుధవారం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల అధికారులతో ఆర్డీవో రామ్మూర్తితో కలిసి నిర్వహిం చిన సమీక్షలోనూ ఇదే విధానాన్ని అనుసరించారు.

రోడ్లు, పట్టణ అభివృద్ధి పనుల వేగంపై ఆదేశాలు

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పలు కీలక ప్రాజెక్టుల విషయంలో గట్టి ఆదేశాలు జారీ చేశారు. కోహెడ నుంచి సముద్రాల వరకు ఉన్న రహదారి పనులను వచ్చే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్‌అండ్ బీ ధి కారులను ఆదేశించారు.

హుస్నాబాద్ నుం చి కొత్తపల్లి వరకు నిర్మించ తలపెట్టిన నాలుగు వరసల రోడ్డు పనుల కోసం టోకెన్ రేజ్ చేయాలని, విద్యుత్, అటవీ శాఖల అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. హుస్నాబాద్ పట్టణంలో దాదాపు పూర్తి కావచ్చిన నాలుగు వరసల రోడ్డు పనులకు అటవీ భూముల క్లియరెన్స్ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

బతుకమ్మ ఘాట్, ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం

మున్సిపల్ పనులపైనా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, పందిల్ల నుంచి ఎల్లమ్మ చెరువు వరకు బీటీ రోడ్డు పనులు వంటి వాటిల్లో వేగం పెంచాలని సూచించారు. ముఖ్యంగా, బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, బతుకమ్మ ఘాట్ పనులను పండుగ లోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపైనా కలెక్టర్ సమీక్షించారు. మంజూరైన ఇండ్లను లబ్ధిదారులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, సకాలంలో పేమెంట్స్ అందేలా ఏఈ హౌసింగ్ అధికారులు చూడాలని సూచించారు. నిర్మాణం చేపట్టని లబ్ధిదారుల నుంచి లేఖ తీసుకొని వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు.

వన మహోత్సవం, ఇతర కార్యక్రమాలపై సమీక్ష

సమావేశంలో వన మహోత్సవం కార్యక్రమంపై కూడా కలెక్టర్ చర్చించారు. సీఏ బ్లాక్, వీఐపీ ప్లాంటేషన్, విద్యాలయాలు, రోడ్ల పక్కన మొక్కలు నాటే లక్ష్యాలను పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తున వెంటనే తులసి, మునగ, జామ వంటి మొక్కలను పంపిణీ చేయాలన్నారు.

మిషన్ భగీరథ పనులు, చెరువుల పర్యవేక్షణ, కొత్త ఆసుపత్రి భవనం ప్లాన్, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం వంటి అంశాలపై కూడా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు, కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు.