17-09-2025 12:53:37 AM
రాయదుర్గంలో ఆధునిక సేవా కేంద్రం ప్రారంభం మంత్రి శ్రీధర్ బాబు
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): భాగ్యనగరంలో పెరుగుతున్న జనాభా, అంతర్జాతీయ ప్రయాణ అవసరాల దృష్ట్యా నగరానికి అదనపు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అవసరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రాయదుర్గంలోని సిరి బిల్డింగ్లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏటా ఒక కోటి మందికి పైగా పాస్పోర్ట్ దరఖాస్తులు వస్తున్నాయని, అందులో తెలంగాణ వాటా సుమారు 11 లక్షలదని చెప్పారు. మునుపటిలా నెలల తరబడి పాస్పోర్ట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. తెలంగాణ పోలీసులు మూడు రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి పౌర సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
కొత్తగా ప్రారంభమైన ఈ సేవా కేంద్రం ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి అన్నారు. రోజుకు వెయ్యి స్లాట్లు అందుబాటులో ఉంచడం వల్ల సేవల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు వివరించారు. పాస్పోర్ట్ అనేది భారతీయుల అంతర్జాతీయ గుర్తింపు పత్రం కాబట్టి యువత ముందుగానే దీన్ని పొందాలని శ్రీధర్ బాబు సూచించారు.
గతంలో టోలీచౌకీషేక్పేట్ ప్రాంతంలోని ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో కొనసాగిన కేంద్రాన్ని ఇప్పుడు రాయదుర్గంలోని 31 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సిరి బిల్డింగ్లోకి మార్చినట్లు తెలిపారు. ఇకపై అన్ని పాస్పోర్ట్ సేవలు పూర్తిస్థాయిలో ఇక్కడ లభిస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 2014లో 110 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆ సంఖ్య 550కు పైగా పెరిగింది.
పాస్పోర్ట్ జారీ ప్రక్రియను సులభ తరం చేసి వేగవంతం చేశారు అని మంత్రి వివరించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ & శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరే టర్ వి. గంగాధర్ రెడ్డి, రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ ఐఎఫ్‌ఎస్తో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.