12-12-2024 01:33:05 AM
దేశీయ టూరిస్టులను ఆకర్షించడంలో సత్తా
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): దేశీయ టూరిస్టులను ఆకర్షి స్తున్న నగరాల్లో హైదరాబాద్ సత్తా చాటింది. 6.89 శాతంతో దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. తాజాగా కేంద్ర పర్యాటక శాఖ జనవరి నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
ఒక్క ఆగస్టు నెలలో పర్యాటకులను ఆకర్షించిన నగరాల జాబితాలో హైదరా బాద్ నాలుగో స్థానంలో నిలిచింది. జనవరి నివేదికలో మాత్రం టాప్ లో నిలిచింది. రాష్ట్ర రాజధానికి వస్తున్న వారిలో మహిళలు 36.29 శాతం, పురుషులు 63.71 శాతం మంది ఉన్నట్లు ఈ నివేదిక కేంద్రం వెల్లడించింది.
వినోదం కోసం..
హైదరాబాద్‌కు వస్తున్న వారిలో సెలవు రోజుల్లో వినోదం కోసం వచ్చేవారే ఎక్కువమంది ఉన్నట్లు నివేదిక చెప్తోంది. జనవరిఆగస్టు మధ్య 42.1 శాతం మంది వినోదం కోసమే నగరానికి వచ్చారు. ఇతర దేశాల్లో ఉంటున్న నగరవాసులు దాదాపు 35.1 శాతం మంది, వ్యాపారం, వృత్తి నిమిత్తం వచ్చినవారు 14.7 శాతం మంది ఉన్నారు. దైవ దర్శనం కోసం వచ్చిన వారు 3.8 శాతం మంది, చదువు కోసం 2.5 శాతం మంది, మిగతావారు ఇతర పనుల నిమిత్తం వచ్చినట్లు కేంద్ర పర్యాటక శాఖ చెప్పింది.
1.65 లక్షల మంది పెరిగారు..
2023లో ఆగస్టు నెలలో దేశీయంగా పర్యటించిన పర్యాటకులు 25.35లక్షల మంది ఉంటే.. 2024లో 27.01 మందికి పెరిగారు. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ సంఖ్య 1.65 లక్షలు ఎక్కువ. ఇదే సమయంలో 2023 జనవరి-ఆగస్టు మధ్యకాలంలో దేశీయ పర్యాటకుల సంఖ్య 1.83 కోట్లు ఉంటే, ఈ ఏడాది 2కోట్లకు పైగా పెరిగారు.