calender_icon.png 27 August, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2035 లోగా భారత్ అంతరిక్ష కేంద్రం

12-12-2024 01:30:03 AM

  1. 2040 నాటికి చంద్రుడిపై కాలు మోపడమే లక్ష్యం
  2. 2026 లోగా అంతరిక్షంలోకి మన వ్యోమగామి

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: త్వరలోనే భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. 2035లోగా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు భారత్ ప్రణాళికలు రచించిందని, ‘భారత్ అంతరిక్ష కేంద్రం’గా దానిని పిలవనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

2035లోపు ఈ కేంద్రం తన పనిని ప్రారంభించేలా కృషి చేస్తున్నట్లు బుధవారం తెలిపారు. అంతేకాకుండా 2040లోపు చంద్రుడిపై కాలుమోపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా, రష్యా, జపాన్, కెనడా వంటి దేశాలకు సొంత స్పేస్ స్టేషన్లు ఉండగా.. భారత్ ప్రస్తుతం ఆ దేశాల సరసన చేరనుంది.

సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడమే కాకుండా 2040 వరకు చంద్రుడి మీద కాలుపెట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన విషయాలను కూడా మంత్రి వెల్లడించారు. 2024 చివర లేదా 2026 మొదట్లో గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి మొదటి భారతీయ వ్యోమగామి వెళ్లనున్నట్లు తెలిపారు.

మానవులను సముద్రమట్టానికి 6వేల అడుగుల లోతులోకి పంపే సముద్రయాన్ మిషన్ గురించి కూడా వివరించారు. ఈ మిషన్ ద్వారా సముద్రాల తీరు తెన్నులను గురించి అందులో ఉన్న వనరులను గురించి అధ్యయనం చేసేందుకు వీలుపడుతుందన్నారు.

ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ఇది భారతదేశపు మొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్ అని వెల్లడించారు. మోదీ ప్రభుత్వ హయాంలో అంతరిక్ష పరిశోధనలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు.