27-01-2026 12:48:56 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): దేశంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద పురపాలికగా అవతరించిన హైదరాబాద్ మహానగరాన్ని పౌర సదుపాయాల కల్పనలో ఆదర్శంగా నిలిపేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టంచేశారు. స్వచ్ఛత, ప్రజారోగ్య పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా బల్దియా పాలన సాగుతోందని వివరించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డితో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. పోలీ సుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 2025 సంవత్సరం జీహెచ్‌ఎంసీ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. 27 మున్సిపాలిటీల విలీనంతో నగర విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని, జనాభా కోటి 34 లక్షలకు చేరిందని వివరించారు.
ఈ బృహత్ నగరాన్ని పాలనా సౌల భ్యం కోసం 150గా ఉన్న వార్డులను 300 లకు, 30 సర్కిళ్లను 60గా పునర్వ్యవస్థీకరించుకున్నామని, ఇది ప్రజలకు సేవలను మరింత చేరువ చేసిందని తెలిపారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయని సంతోషం వ్యక్తంచేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, జీఐఎస్ మ్యాపింగ్, వీబీడీ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామన్నారు. దీని ఫలితంగా నగరంలో డెంగ్యూ కేసులు గత ఏడాదితో పోలిస్తే 30 శాతం తగ్గాయని, ఈ కృషికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు.
పారిశుద్ధ్య నిర్వహణలోనూ నగ రం మెరుగైన ఫలితాలు సాధించిందని, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా 6వ స్థానం, 7 -స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ హోదా దక్కడం ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్లు కలిసి 9 మంది దివ్యాంగులకు వినికిడి పరికరాలు, వీల్ చైర్లు వంటివి అందజేశారు. మహిళా సాధికారతలో భాగం గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7,127 స్వ యం సహాయక సంఘాలకు రూ.855 కోట్ల రుణాల చెక్కును పంపిణీచేశారు.
ఇందులో ప్రత్యేకంగా 4 ట్రాన్స్‌జెండర్ స్వయం సహాయక సంఘాలకు రూ.19.5 లక్షల రుణాలు అందించారు. స్వయం ఉపాధి కింద 47 మంది మహిళలకు రూ.3.07 కోట్ల అందజేయగా, వీరిలో ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. జ్యూట్ బ్యాగుల తయారీతో ఉపాధి పొందుతున్న ప్రేమ్ లీల ట్రాన్స్‌జెండర్ గ్రూపునకు రూ.6 లక్షలు అందించడం విశేషం.
ఈ వేడుకల్లో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అల, అదనపు కమిషనర్లు సుభద్రా దేవి, రఘుప్రసాద్, సత్యనారాయణ, మంగతాయారు, పంకజ, సీసీపీ శ్రీనివాస్, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహరెడ్డి, చీఫ్ ఇంజినీర్ సహదేవ్, పీఆర్వో మామిండ్ల దశరథం పాల్గొన్నారు.