01-11-2025 11:49:41 PM
నిజాయతీ ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలి..
బిహెచ్‌ఎల్ విజిలెన్స్ వారోత్సవాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్..
హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): ప్రభుత్వ వ్యవస్థల పనితీరు, పౌరుల హక్కులు, చట్టాలపై ప్రజలందరికీ సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే అవినీతి రహిత సమాజం సాధ్యమవుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నిజాయతీ అనేది కేవలం కొందరికో, కొన్ని శాఖలకో పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ హైదరాబాద్ యూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.. హైడ్రా చేపట్టిన కార్యక్రమాలను ఉదాహరణగా చూపుతూ, చైతన్యం ఎలాంటి మార్పును తీసుకువస్తుందో రంగనాథ్ వివరించారు. ఒకప్పుడు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గురించి చాలా మందికి అవగాహన ఉండేది కాదు. కానీ హైడ్రా చేపట్టిన చైతన్య కార్యక్రమాలతో ఇప్పుడు ఇంటి స్థలం కొనేవారు సైతం ఈ లెక్కలన్నీ సరిచూసుకుంటున్నారు.
దీనివల్ల ఏడాది కాలంలోనే దాదాపు వెయ్యి ఎకరాల ప్రభుత్వ, చెరువుల భూమిని కాపాడగలిగాం. ప్రజలలో అవగాహన పెరగడం వల్లే ఇది సాధ్యమైంది అని ఆయన తెలిపారు.. నగర భవిష్యత్తుకు పొంచి ఉన్న ముప్పును ఆయన గణాంకాలతో సహా వివరించారు. ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్లోని 61 శాతం చెరువులు ఇప్పటికే కనుమరుగయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 15 ఏళ్లలో నగరంలో ఒక్క చెరువు కూడా మిగలదు. ఈ పెను ప్రమాదాన్ని నివారించేందుకే హైడ్రా నడుం బిగించింది. చెరువులు, నాలాలను పరిరక్షిస్తేనే భవిష్యత్తులో వరదలను నియంత్రించగలం. ఇందులో భాగంగా మొదటి విడతగా 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నాం, అని రంగనాథ్ వెల్లడించారు.
హైడ్రా చేపట్టే ప్రతి చర్య అత్యంత పారదర్శకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీహెచ్‌ఈఎల్ హైదరాబాద్ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేబీ రాజా మాట్లాడుతూ, అవినీతి నిర్మూలనపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ లక్ష్యంతోనే విజిలెన్స్ వారోత్సవాలను పాఠశాలల్లో కూడా నిర్వహించాం. చిన్నతనం నుంచే నిజాయతీ, నైతిక విలువల గురించి తెలుసుకుంటే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు,అని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం, వారోత్సవాల్లో భాగంగా ఉద్యోగులు, విద్యార్థుల కోసం నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్‌ఈఎల్లోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.