calender_icon.png 2 November, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజ్ భవన నిర్మాణ పనులు కార్పొరేషన్ కు అప్పగించాలి

01-11-2025 11:51:31 PM

బిసిఏలో చేర్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలి..

తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ

ఖైరతాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ కులస్తులకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, చైర్మన్ పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ ముదిరాజులు మాట్లాడారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ముదిరాజ్లను బీసీ డి గ్రూప్ నుండి బీసీ ఎ గ్రూప్ లోకి మార్చే ప్రక్రియ కోసం పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ రాష్ట్ర బీసీ కమీషన్ కు ముదిరాజ్ స్థితిగతులను తేల్చి తగు న్యాయం చేయాలని సూచించిందని కోర్టు ఆదేశాలు అమలు జరిగే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.

ముదిరాజ్ అభివృద్ధికోసం ప్రభుత్వం కోకాపేట్లో లో 5ఎకరాల భూమిని కేటాయించి దాని అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు చేసినట్లు తమకు సమాచారం ఉందని కాని కొంత మంది వారి స్వార్థప్రయోజనాల కోసం ఒకరిద్దరిని ట్రస్ట్లో చేర్చి వారి ద్వారా అభివృద్ధి చేపడుతున్నామని ముదిరాజ లను మభ్యపెడుతున్నారన్నారు. కావున ట్రస్ట్ ద్వారా అయితే అవకతవకలు జరిగే అవకాశం ఉన్నందున భవన నిర్మాణ పనులను కార్పొరేషన్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే ముదిరాజ్ కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయించాలని, ముదిరాజ్ జీవనోపాధి అయిన మత్స్యపరిశ్రమలో జిఒ 98 అమలు చేసి న్యాయం చెయ్యాలని, సంఘాలకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ స్ఫూర్తి తో ముదిరాజ్ లందరు ఏకతాటిపైకి వచ్చి ఐక్యత చాటితేనే మనకు రావాల్సిన హక్కులు పొందగలుగుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రధాన కార్యదర్శి నీరజ ముదిరాజ్, నగర మహిళా అధ్యక్షురాలు చెరువు రాణి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.