19-07-2025 02:10:20 AM
- రూ.30 వేల కోట్ల విలువైన భూముల రక్షణ
- కబ్జాల నుంచి 500 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి
- బతుకమ్మ కుంట వద్ద సంబరాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా శనివారం నాటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాది కాలంలోనే అక్రమార్కులకు వణుకు పుట్టిస్తూ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వైపు కన్నెత్తి చూడాలంటేనే గుబులు రేపే పరిస్థితిని హైడ్రా తీసుకొచ్చింది. పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్‌ఫాత్ వంటి ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించింది.
గతేడాది జూన్ 27న ఫిల్మ్‌నగర్‌లోని కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద లోటస్ పాండ్ పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను కూల్చడంతో హైడ్రా యాక్షన్ మొదలైంది. అప్పటి నుంచి ఆక్రమణలపై జులుం ప్రదర్శిస్తూ వస్తున్నది. ఏడాది కాలంలో 581 చోట్ల ఆక్రమణలను తొలగించి, 499 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. వీటి విలువ దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
ఇందులో 36 చెరువుల ఆక్రమణలను తొలగించి 133 ఎకరాలు, లేఅవుట్లు, ఇతర కాలనీల్లో 86 చోట్ల ఆక్రమణలను తొలగించి 123 ఎకరాలు, 20 నాలాల ఆక్రమణలను తొలగించి 8 ఎకరాలకు పైగా, 74 రహదారుల ఆక్రమణలను తొలగించి 218.30 ఎకరాలు, 38 పార్కుల ఆక్రమణలను తొలగించి 10.65 ఎకరాలను కాపాడింది. అలాగే 5.94 ఎకరాల్లో అనధికార నిర్మాణాలను కూల్చేసింది.
భవిష్యత్ ప్రణాళికలు
హైడ్రా పరిధిలో 950 చెరువులుండగా వాటి పరిధికి సంబంధించి ఇప్పటికే 150 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్, 500 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఖరారు చేసి, ఆక్రమణలు లేకుండా చూస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శాటిలైట్ మ్యాప్‌ల కోసం ఎన్‌ఆర్‌ఎస్సీతో ఒప్పందం చేసుకున్నారు. వ్యర్థాల డంపింగ్‌కు అలర్ట్ సిస్టమ్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటుతోపాటు ప్రభుత్వ ఆస్తుల డిజిటలైజేషన్, జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు.
చెరువుల రక్షణతో పాటు నగరంలో వరదల నివారణ, ఫైర్ సేఫ్టీ వంటి డిజాస్టర్ రెస్పాన్స్ బాధ్యతలను కూడా హైడ్రా నిర్వహిస్తోంది. ప్రస్తుతం 51 డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, 150 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఏర్పాటు చేయగా, వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా ఈ బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటతో పాటు, పైలట్ ప్రాజెక్టులో భాగంగా మాదాపూర్ సున్నం చెరువు (14.09 ఎకరాలు), తమ్మిడి కుంట (13.02 ఎకరాలు), ఉప్పల్ నల్లచెరువు (14.81 ఎకరాలు), పాతబస్తీలోని బుమ్ రుక్ నుదౌలా (12.54 ఎకరాలు), కూకట్‌పల్లి నల్ల చెరువుకు (15.26 ఎకరాలు) పూర్వ వైభవం తె చ్చేందుకు హైడ్రా పనులు ప్రారంభించింది.
ఏడాది సంబరాలు
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట వద్ద శుక్రవారం హైడ్రా ఏడాది సంబురాలు నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు మానవహారంగా చెరువు చుట్టూ నిలబడి, బతుకమ్మకుంటకు ప్రాణం పోసిన హైడ్రాకు ధన్యవాదాలు.. హైడ్రాతోనే భవిష్యత్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో వందలాది చెరువుల పునరుద్ధరణకు బతుకమ్మ కుంట ఒక నమూనా అని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతోనే ఇది సాధ్యమైందని తెలిపా రు. సెప్టెంబరు 21న ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రానున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. కేవలం 4 నెలల్లో చెత్త, వ్యర్థాలతో నిండిన ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన చెరువుగా మార్చడం దేశ చరిత్రలోనే రికార్డు అని కొనియాడారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ.. బతుకమ్మ కుంట చెరువును చూస్తే తన బాల్యం గుర్తుకొస్తోందని, దీని అభివృద్ధి కోసం తాను సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రాను కోరానని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, హైడ్రా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.