20-05-2025 02:49:09 AM
ప్రైవేట్ స్థలంలో వెలిసిన షెడ్ల తొలగింపు
కూకట్‌పల్లి, మే 19: కూకట్‌పల్లి సర్కిల్ హైదర్‌నగర్ డివిజన్‌లో సోమవారం హైడ్రా అధికా రులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 145/3లోని 9.27 ఎకరాల స్థలాన్ని 2000 సంవత్సరంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొని లే అవుట్ నిర్మించారు. అందులో 79 ప్లాట్లు చేసుకున్నారు. అయితే 2007లో ఎన్‌ఎస్‌డీ ప్రసాద్, డైమండ్ హిల్స్ ప్లాట్ కొనుగోలుదారుల మధ్య వివాదం కొనసాగింది. అప్పటినుంచి ఇది వ్యవసాయ భూమి అని, ఆ స్థలం ఆయన స్వాధీనం లోనే ఉండిపోయింది. ప్లాట్ ఓనర్స్ కోర్టును ఆశ్రయించగా 2024 సెప్టెంబర్ 9న ప్లాట్ ఓనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
దీంతో గత సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్లాట్ ఓనర్స్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరువురిని పిలిచి వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ స్థలం ప్లాట్ ఓనర్స్‌కే దక్కుతుందని నిర్ధారణకు వచ్చి వారం రోజుల్లో కూల్చివేతలు చేపట్టి సమస్యను పరిష్కరించడంతో కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.