calender_icon.png 25 May, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద సమస్యకు 'హైడ్రా' పరిష్కారం

24-05-2025 12:23:34 AM

మారుతి నగర్ ప్రజలకు తీరిన ఇక్కట్లు 

ఎల్బీనగర్: అకాలవర్షంతో పోటెత్తిన వరద సమస్యకు హైడ్రా పరిష్కారం చూపింది. కాలువలో అడ్డుపడిన చెత్తను తొలగించి సాఫీగా వరద నీరు సాగేలా చర్యలు తీసుకుంది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి చంపాపేట డివిజన్ లోని మారుతీనగర్ లో వరద సమస్య తలెత్తింది. కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇళ్లలోని వంట సామగ్రి వర్షం నీటిలో తేలియాడడం, వీధుల గుండా వరదప్రవాహం వలన ఆటోలు, మోటర్ సైకిల్స్ కొట్టుకు పోవడం తదితర సమస్యలపై ఫిర్యాదులు అందుకున్న హైడ్రా తక్షణమే స్పందించి తాత్కాలిక చర్యలు తీసుకుంది. సల్కం చెరువు నుంచి వచ్చే వరద, వరదకాలువ వెడల్పునకు మారుతీనగర్ లో లేకపోవడంతో ఉన్న కాలువకు పొంతన ఈ సమస్య తలెత్తింది.

మారుతీనగర్ లోని బాక్సు డ్రైన్ చిన్నదిగా ఉండడమే కాకుండా చెత్త, చెదారం పేరుకుపోవడంతో వరద నీరు పోటెత్తింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం ఉదయం చంపాపేటలోని మారుతీనగర్ లో పర్యటించారు. సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరద నీరు ఇళ్లను ముంచెత్తడానికి కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. జేసీబీని తెప్పించి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. ఆ వెంటనే హైడ్రా చర్యలు చేపట్టడంతో వరద నీరు సాఫీగా సాగిపోతోంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా పైనుంచి వస్తున్న వరద కాలువ వెడల్పుతో సమానంగా మారుతీనగర్ లో కూడా విస్తరించాల్సి ఉందని కమిషనర్ రంగనాథ్ భావించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు.