calender_icon.png 11 September, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ సిద్ధమే

11-09-2025 12:00:00 AM

-స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం

-ప్రస్తుత కమిటీతో రాష్ట్రంలో బీజేపీ గెలవలేదు

-ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర బీజే పీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పార్టీ నూతన కమి టీ కూర్పుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏకంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వేసిన కమిటీతో బీజేపీ అధికారంలో కి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేశారు.

దమ్ముంటే కిషన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని, తానూ కూడా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని, ఇద్దరం స్వతంత్రులుగా పోటీ చేసి ఎవరి బలమేంటో తేల్చుకుందామని బహిరంగ సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్, పార్టీ రాష్ర్ట నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తగా వేసిన ఆఫీస్ బేరర్ల కమిటీని ఎవరు నియమించారు? రాష్ర్ట అధ్యక్షుడు టీ రాంచందర్‌రావు వేశారా లేక తెర వెనుక నుంచి కిషన్‌రెడ్డి వేశారో అర్థం కావడం లేదు. ప్రస్తుత అధ్యక్షుడు కేవలం రబ్బర్ స్టాంప్‌గా మిగిలిపోయారని విమర్శించారు.

ఈ కమిటీతో రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్, కిషన్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. ‘కిషన్‌రెడ్డి తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తే, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుదాం.

ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు. అయితే, తనంతట తానుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఒకవేళ చేయకపోతే ఏం చేస్తారని ఆయన ఎదురు ప్రశ్నించారు. రాష్ర్ట నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, పార్టీ జాతీయ అధిష్ఠానంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. అధిష్ఠానంం నుంచి పిలుపు వస్తే ఢిల్లీ వెళ్లి కలుస్తా.. నన్ను మళ్లీ పార్టీలో చేరమని ఆదేశిస్తే చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.