31-10-2025 01:49:27 AM
 
							రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా హైలైట్స్‌ను డైరెక్టర్ మీడియాతో పంచుకున్నారు.
- నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు చూసిన ఒక సంఘటన ఆధారంగా ఈ కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు పురిగొల్పింది. తొలుత ఆహా వాళ్లు అడిగితే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కథ పంపా. నేను, రష్మిక, గీతాఆర్ట్స్ కాంబోలో ఒక సినిమా చేయాల్సి ఉండేది. ఈ కథను అల్లు అరవింద్ చదివి దీంట్లో సినిమా కంటెంట్ ఉంది.. ఓటీటీకి వద్దని చెప్పారు. మా కాంబోలో ముందు అనుకున్న కథ పక్కనపెట్టి దీన్నే సినిమాగా మొదలుపెట్టాం.
- ఏ కథ రాసినా నా ఫ్రెండ్స్ సమంత, వెన్నెల కిషోర్, అడివి శేష్, డైరెక్టర్ సుజీత్.. ఇలా కొంతమందికి పంపిస్తుంటా. ఈ కథా పంపా. ఇందులో హీరోయిన్‌గా సమంతను అనుకున్నారనే వార్తలొచ్చాయి. సమంత ఈ స్క్రిప్ట్ చదివి, నేను కాదు మరొక హీరోయిన్ అయితేనే ఈ కథకు బాగుంటారని సూచించింది. ‘అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యా. అమ్మాయిలందరికీ నేనిచ్చే బిగ్ హగ్ ఈ సినిమా అని రష్మిక చెప్పింది.
-ఈ కథలో హీరో, హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథను హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నాం. ‘మీరు నన్ను ఇలాగే స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయాలి.. రియలిస్టిగ్గానే నా క్యారెక్టర్ కనిపించాలి’ అని రష్మిక సపోర్ట్ చేసింది.
- ఈ సినిమాలో లెక్చరర్ రోల్‌ను డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా చేస్తే బాగుంటుందనిపించింది. ఆయనను సంప్రదిస్తే ‘వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియెన్స్ నవ్వుతారు’ అని రిజెక్ట్ చేశారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సి వచ్చింది.
- ఒక జంట జీవితంలో జరిగినదాన్ని నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. నేను ఇవాళ మంచి అనుకున్నది ఐదేళ్ల తర్వాత కరెక్ట్ కాదని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్‌లు ఇచ్చే ధైర్యం చేయను. నేను చూసినవి, చదివినవి, తెలుసుకున్న సంఘటల నుంచి స్ఫూర్తి పొంది కథ రాస్తుంటా. దర్శకుడిగా నాకొక ముద్ర ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను కొన్ని సినిమాలు చేశాక అందులో నా తరహా విలువలు, నమ్మకాలు చూసి ప్రేక్షకులకు రాహుల్ డైరెక్షన్‌లో ఇలాంటి సెన్సబిలిటీస్ ఉన్నాయనే ఇంప్రెషన్ కలుగుతుందేమో.
-నెక్ట్స్ నేను డైరెక్ట్ చేయబోయే రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. ఈ రెండింటి తర్వాత రష్మిక, నేను మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్‌గా రష్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సి ఉంది.
- నేను అసిట్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం చూస్తున్న టైమ్‌లో హీరోగా అవకాశం వచ్చింది. పరిచయాలు పెరుగుతాయని ఒప్పుకున్నా. కానీ, నా ఆలోచన ఎప్పుడూ డైరెక్షన్, రైటింగ్ వైపే ఉండేది. హీరోగా ఒక కమిట్‌మెంట్ ఉండాలి. దాదాపు ఏడాది ఆ సినిమాకే టైమ్ ఇవ్వాలి. నేను డైరెక్టర్‌గా తొలి సినిమా చేసినప్పుడే హీరోగా వద్దనుకున్నా. నటించడాన్ని ఎంజాయ్ చేస్తా. కానీ, డైరెక్షనే నా కెరీర్‌గా భావిస్తా. 20 రోజుల కాల్షీట్ ఉండే క్యారెక్టర్స్ అయితే ఒప్పుకుంటున్నా. ఆ దర్శకుడి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవచ్చనేదే నా ఆలోచన.
- సుజిత్ నా ఫ్రెండ్.. ఆయన చెప్పగానే ‘ఓజీ’లో నటించా. హను రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. హను తన తర్వాతి సినిమాలో హీరోగా నటించమని అడిగితే కచ్చితంగా నటిస్తా.