29-09-2025 12:00:00 AM
ఎంగిలి పూలల్లో ఉరిమి
తంగేడు పూలల్లో పుట్టి
గునుగు పూలలో పెరిగి
గుమ్మడి పూలల్లో గౌరమ్ము
సద్దుల బతుకమ్మతో
విశ్వవ్యాప్తమైన బతుకమ్మ!
వంటా వార్పులలో, మానవహారాల్లో
రైలురోకోలు రాస్తారోకోల్లో
ఆందోళనల్లో
సకలజనుల సమ్మెలో పిడికిళ్లెత్తిన
ఉద్యమ బతుకమ్మ
స్వయం పాలన సగౌరవం కోసం
ఆశ్వత వృక్షంలా నిలబడి
అస్తిత్వాన్ని శిఖరాయమానం చేసింది
చిత్తు చిత్తుల బొమ్మా
శివుని ముద్దుల గుమ్మా
చింత చిగురై పూసింది
మామిడి తోరణమైంది..
దేవుని మెడలో మాలలైన పూలు
పూజలో అభిషేకమైన పూలు
పంచామృతంలో తడిసిన పూలు
తెలంగాణ ఉద్యమంలో పువ్వులే దేవత
పువ్వులే బతుకమ్ము విరాజిల్లింది
మన్ను కప్పిపెట్టినచోట
విత్తుమొలకెత్తింది
అవమానించినచోట అంకురమై
అంకుశమైన
ఆత్మగౌరవ పతాకం
సకలజనుల ఆది పండుగ
హద్దులులేని ఎల్లలు దాటిన గౌరమ్మ
మనకు బతుకునిచ్చిన బతుకమ్మ తల్లి
బతుకమ్మ..
ఒక మేల్కోలుపు
పూలపరిమళాల సుగంధం
ఎన్నిసార్లు విన్నా వినాలని వెంటాడె
ఇద్దరక్కచెల్లెండ్లు ఉయ్యాలో..
పాట వింటున్న ప్రతిసారి
మళ్లీ మళ్లీ మొలకెత్తినట్లే
మళ్లీమళ్లీ ఉద్యమించినట్లుంటది
బతుకుల్లో జీవంపోసిన పాటగదా
ఆ పాటే వింటాను
మళ్లీ మళ్లీ ఆ పాటే పాడతాను
మేదరి నర్సవ్వ వెదురు బరుగుల
శిబ్బినల్లినట్లు
తాటి చెట్టునెక్కి కాటమయ్య
కల్లొంపుతున్నట్లు
పూసల రాజవ్వ చెత్తిరి అల్లుతున్నట్లు
సాలోల మల్లవ్వ మగ్గం నేస్తున్నట్లు
బీర్లోల్ల కిష్టమ్మ కండెలు వొడుకుతున్నట్లు
ఊరు గుండె వాకిట్ల పెద్దబతుకమ్మ
ఆ తల్లి ఎప్పుడు పుట్టిందో గాని..
నేను చూసినప్పటి నుంచి
చేతినిండా బతుకమ్మ
ఊరూర విగ్రహమై ఉత్సవమూర్తుంది
తెలంగాణకు నిలువెత్తున
నింగి మురిసిట్లు తంగేడు గిరులు
గౌరమ్మ వేడుక వైభవం ఆరాధన
ఆనవాళ్ల భయం విద్వేషం
మతిలేని తనంతో
చేతలలోంచి తీసేశారు
బతుకమ్మను తుంచటమంటే
వెలుగును మబ్బుల్లో ఉంచటమే
ఎక్క బుడ్డి స్థానంలో
కందిళి వచ్చింది
పెట్రమాక్స్ వచ్చింది
బల్బు వచ్చింది
ట్యూబ్ లైట్ వచ్చింది
హెలోజన్ బల్బు వచ్చింది
ఎల్‌ఈడీ, సీఫ్‌లు ఎన్నోచ్చినా
వీధుల్లో ఎక్కను వెలిగించిన
శంకరమ్మ చెయ్యి
సామాజిక సాంస్కృతిక బతుకమ్మను నిలిపిన తెలంగాణ అజరామరం
ఊరుకు బొడ్రాయి మూలం
ఊరు చేతులు గోరింటాకులై
పులుముకున్నాయి
మట్టి చెట్టు పుట్ట అగ్నిగుండం
అలాయిబలాయి
పూలే నోళ్లు విప్పి సగౌరవంగా
పాడిన పాటల్నీ అమ్మ పాడటం విన్నాను..