calender_icon.png 30 September, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ నవలా రచయిత్రుల చైతన్యం

29-09-2025 12:00:00 AM

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎందరో రచయిత్రులు దశాబ్దాల నుంచి తమ నవలా సాహిత్యంలో సమాజంలోని మనుషుల స్వభావాలను, మారుతున్న ప్రాపంచిక దృక్పథాలను తమ  రచనల్లో ప్రతిబింబించారు. కేవలం కథ, కథనానికే పరిమితం కాకుండా వస్తువును, తమదైన శైలిలో శిల్పాన్ని ఒడిసిపట్టి సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేశారు. సమాజ శ్రేయస్సు, పల్లె,- పట్టణ జీవనం మధ్య తారతమ్యాలు, జీవన స్థితిగతులు, కుల వివక్ష, మహిళల సమస్యలు, అస్తిత్వ ఉద్యమాలు, సామాజిక సమస్యల వంటి విస్తృత అంశాలకు పెద్దపీట వేశారు. తెలంగాణలో ప్రచురితమైన మొట్టమొదటి స్త్రీ నవల ‘శోభావతి’. ఈ నవలను 1924లో రచయిత్రి సీతా పిరాట్టమ్మ వెలువరించారు.  రచయిత్రి నవల ద్వారా కథానాయిక శోభావతి పాత్రతో నాటి సామాజిక, సంప్రదాయ కట్టుబాట్ల స్త్రీ నలిగిపోయిన తీరును వివరించారు.

ఇదే సంవత్సరం చాట్రాతి లక్ష్మీనరసమ్మ ‘అనురాగ విపాకము’ పేరుతో నవల రాశారు. నవల ద్వారా పురుషులతో సమానంగా స్త్రీలకు మనోభావాలుంటాయని, ఏ విషయంలోనైనా స్త్రీ పురుషులు సమానమనే అంశాన్ని చర్చించారు. హైదరాబాద్‌కు చెందిన రచయిత్రి సూఘ్రా బేగం అప్పట్లోనే 14 నవలలు రాయడం ఒక సంచలనం. ఆమె నవలల్లో 1929లో ముద్రించిన ‘మోహిని’ ఎంతో ప్రసిద్ధిగాంచింది. 1935లో రచయిత్రి చిలకపాటి సీతాంబ నవల ‘అరవింద’ వెలువడింది. నవల ద్వారా స్వాతంత్య్రోద్యమంలో స్త్రీల పాత్రను రచయిత్రి చక్కగా వివరించారు. వారి పరంపరను ఆ తర్వాత మరికొంతమంది రచయిత్రులు కొనసాగించారు. గడిచిన 50 ఏళ్లలో ఎంతోమంది రచయిత్రులు వెలుగులోకి వచ్చారు. ఎప్పటికప్పుడు సరికొత్త వస్తువులు ఎన్నుకొని తమ రచనలు సాగించారు. ముఖ్యంగా స్త్రీల సమస్యలపై విస్తృతంగా నవలు వెలువరించారు.

‘పాలమూరు’ సాహిత్య పరంపర..

పాలమూరు జిల్లాకు చెందిన రచయిత్రి శ్రీలత పది నవలలు రాశారు. వాటిలో ‘వెన్నెల స్పర్శ’ నవల ఎంతో ప్రసిద్ధం. స్త్రీ, పురుష అనుబంధాల మాధుర్యం, సున్నితమైన ప్రేమను వర్ణిస్తుందీ నవల. మక్తల్ ప్రాంతానికి చెందిన సీతమ్మ ‘మధు మాలతి’ అనే నవల ద్వారా ప్రసిద్ధి పొందారు. పెబ్బేరుకు చెందిన పోల్కంపల్లి శాంతాదేవి 1961లో ‘పాణిగ్రహణం’ నవల ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించారు. ‘కాలపురుషుని హెచ్చరిక’, ‘చండీప్రియ’, ‘ప్రేమ పూజారి’, ‘బాటసారి’, ‘రక్త తిలకం’, ‘పచ్చిక’, ‘జీవన సంగీతం’, ‘ప్రేమబంధం’, ‘వరమాల’, ‘పుష్యమి’, ‘దేవదాసి’ వంటి 40కి పైగా నవలలు రాశారు.

ఆమె రచనలకు సమాజంలో మహిళలు ఎందుర్కొంటున్న సమస్యలే ఇతివృత్తాలు. ఇదే జిల్లాకు చెందిన తంగెళ్ల శ్రీదేవిరెడ్డి ‘స్వప్న సౌధం’, ‘వీలునామా’ నవలలు రాశారు. ‘స్వప్న సౌధం’ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న దుస్థితులను, గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించింది. ఆంధ్రాప్రాంతానికి చెందిన స్వర్ణలత పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు సల్గుటి సుధాకర్‌రెడ్డిని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె స్వర్ణ సుధాకర్‌రెడ్డి పేరుతో ‘కోడలు పిల్ల’ అనే నవల వెలువరించారు. నవల ద్వారా కుటుంబ సంబంధాలపై లోతైన భావాలను చర్చించారు.

‘ఇందూరు’ సాహితీకారులు..

నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌కు చెందిన కంఠంనేని స్వప్న వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సాహిత్యంపై ఉన్న మక్కువతో ఆమె వారపత్రికల్లో ధారవాహికలుగా అనేక నవలలు రాశారు. యువత జీవితాల్లో వస్తున్న మార్పులు,వారి ఆశలు, ఆకాంక్షలు, నిరాశ, నిస్పృహలను ఆమె తమ రచనల్లో వాస్తవికంగా చిత్రీకరించారు. జక్రాన్‌పల్లికి చెందిన అమృతలత ‘ఆమె సృష్టిలో తీయనిది’ అనే నవలను వెలువరించారు. నవలలో జయ అనే ప్రధాన పాత్ర ద్వారా రచయిత్రి  హాస్టల్ జీవితం, అక్కడ స్నేహబంధాలను, విద్యాసమయపు అనుభూతులను వాస్తవికంగా ప్రతిబింబించారు. ఇదే జిల్లాకు చెందిన శ్రీపాద స్వాతి ‘పునరాగమనం’, ‘చిరుజల్లు కురిసేనా?’, ‘ఎక్కడి నుండి ఇక్కడి దాకా’, ‘చుక్కాని’, ‘చిరుదీపం’ వంటి నవలను వెలువరించారు.

మారుతున్న ప్రాపంచిక దృక్పథాలను, మహిళల ఆకాంక్షలను రచయిత్రి నవలల ద్వారా ప్రతిబింబించారు. కామారెడ్డికిచెందిన రాజీవ ‘నడుస్తున్న కథ’ నవల ద్వారా భర్త మరణం తర్వాత రెండో వివాహం చేసుకున్న మహిళకు ఎదురయ్యే ఒత్తిళ్లను రచయిత్రి చర్చించారు. డాక్టర్ పరావస్తు కమల ఆరు నవలలు రాశారు. ‘రాధిక జీవితాన్ని మథిస్తే’ నవలలో రచయిత్రి స్త్రీ జీవన సమస్యలు, వ్యక్తి, సమాజ సంబంధాలు, మనిషి మనుగడ పోరాటాలను చర్చించారు. కిరణ్ బాల ‘ఏ సీమ దానివో’ నవలలో స్త్రీల సామాజిక సమస్యలను ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. సంబరాజు లీల 11 నవలలు రాశారు. స్త్రీ జీవన గాథలు, కుటుంబ అనుబంధాలు, సమాజ వాస్తవికతను సందర్భోచితంగా నవలల్లో ప్రతిబింబించారు. రచయిత్రి శాంతి ప్రబోధ ‘జోగిని’ నవల అత్యంత ప్రాచుర్యం పొందింది. రచయిత్రి నవలలో పోశవ్వ అనే జోగిని తన వృత్తిని విడిచి, రాజకీయ రంగంలోకి ప్రవేశించి నాయకురాలిగా ఎదిగిన తీరును కథాంశంగా రాశారు. వ్యవస్థలో వేళ్లూనుకున్న స్త్రీలపై అణచివేతను కళ్లకు కట్టినట్టు వివరించారు.

‘ఓరుగల్లు’ చైతన్య ప్రవాహం..

ఓరుగల్లు ప్రాంతానికి చెందిన స్త్రీ నవలా రచయిత్రుల్లో బొమ్మ హైమాదేవి సాహిత్యరంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆమె 1960 1996 వరకు సుమారు 40కి పైగా నవలలు, కథలు రాశారు. ‘భావన భార్గవి’, ‘నవ ధాన్యాలు’, ‘నవ రసాలు’, ‘దీప’ తదితర రచనలు బహుళ ప్రాచుర్యం పొందాయి. నాటి సామాజిక పరిస్థితులనే ఇతివృత్తాలుగా రచయిత్రి నవలలు రాశా రు. తర్వాతి కాలంలో అయినవోలు అరుణాదేవి 1993లో ‘మిగిలిన ప్రశ్న’ వెలువరించిన నవల నాటి స్త్రీల ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించింది. మందారపు వాణిశ్రీ ‘సెలవుల్లో పట్టణం’, ‘శశిరేఖ’, ‘కులానికి సమాధి’ నవలల ద్వారా కుల వ్యవస్థపై సమాజ ప్రతికూల దృక్పథాన్ని ఆవిష్కరించారు. రంగరాజు పద్మజ తన ‘హరిదా సి’ నవలలో  స్త్రీలపై భక్తి, సంప్రదాయాల ప్రభావాలను చర్చించారు. కొండపల్లి నీహారిణి ‘మృత్యంజయుడు’ నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలపు నేపథ్యాన్ని తీసుకుని నాటి ప్రజల సమర స్ఫూర్తిని వివరిం చారు.

అంగులూరి అంజనీదేవి ‘మధురిమ’, ‘నీకు నేను న్నా’, ‘మౌనరాగం’, ‘ఈ దారి మనసైనది’, ‘రెండో జీవితం’, ‘ఎనిమిదో అడుగు’ నవలలు, వేముగంటి శుక్తిమతి ‘నేను సైతం’, ‘మళ్లీ పల్లె ఒడిలోకి’ నవలలు, నంద గిరి ఇందిరాదేవి ‘ఆనందధార’, నెల్లుట్ల రమాదేవి ‘కలువ బాల’, ఇందుమతి తాళపల్లి యాకమ్మ ‘ఉద్యమ కెరటం’ నవల, నామని సుజనాదేవి ‘ఐ లవ్ మై ఇండియా’, జాజుల గౌరీ ‘మన్నుబువ్వ’ వంటి నవలలు నాటి సామాజిక రుగ్మతలు, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి బింబించాయి. ముదిగంటి సుజాత రెడ్డి రచనలు ‘మలుపు తిరిగిన రథచక్రాలు’, ‘ఆకాశంలో విభజన రేఖలు లేవు’, ‘సంకెళ్లు తెగిపోయాయి’ నవలు, గంటి భానుమతి నవలలు ‘గ్రహణం’, ‘చివరి ప్రయాణం’, ‘అనగనగా ఒక రోజు’, ‘ఆ ఇద్దరు’, ‘తప్పటడుగు’, ‘అన్వేషణ’, ‘ఆమె గెలిచిందా? ఓడిందా?’ నవల ద్వార సమాజంలో చర్చకు నోచుకోని ఎన్నో సమస్యలను చర్చించారు.

రంగారెడ్డి, హైదరాబాద్ రచయిత్రులు..

రంగారెడ్డి జిల్లాకు చెందిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన సాహిత్యరంగానికి విశేషమైన సేవలందించారు. జీవిత కాలంలో 150 కథలు, 72 నవలలు, రెండు నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. ఆమె రచనలు వాస్తవికత, కుటుంబ జీవనం, స్త్రీ భావజాలం, సామాజిక పరిస్థితుల ప్రతిబింబాలు. వీరి 10 నవలలు సినిమాలుగానూ వచ్చాయి. ‘అందగాడు’, ‘అద్దాల మేడ’, ‘అంతం చూసిన అసూయ’, ‘అందని పిలుపు’, ‘అగ్ని పరీక్ష’, ‘అధికారులు’, ‘ఆశ్రిత జనులు’, ‘ఋతుచక్రం’, ‘జీవనయాత్ర’, ‘తరం మారింది’, ‘పూల మనసులు’, ‘ప్రేమలు పెళ్లిళ్లు’, ‘మతం మనిషి’, ‘మరీచిక’, ‘వారసులు’, ‘గృహలక్ష్మి’ నవలలు పాఠకులను ఎంతో ఆకట్టుకున్నాయి.

1979లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో చంద్రహరీష్ స్త్రీ రచయిత్రుల సాంఘిక నవలలపై అధ్యయనం చేశారు. 1988లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టీవీ నాగరాజు ఆధునిక తెలుగు రచయిత్రుల నవలల్లో సామాజిక అవగాహన అంశాలను విశ్లేషించారు. 1994లో మద్రాస్ యూనివర్సిటీలో విజయలక్ష్మి ఆధర్వ్యంలో రచయిత్రుల నవలల్లో స్త్రీల ఉద్యమాలపై చర్చ జరిగింది. 1986లో ఎంఫిల్ స్థాయిలో డీ వసుంధర రచయిత్రుల నవలల్లో స్త్రీ సమస్యల చిత్రణను విశ్లేషించారు. 2009లో ఎన్ భాస్కరనాయుడు ‘దృశ్యాదృశ్య’ నవలపై పరిశోధన చేపట్టారు. ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎందరో మహిళా నవలా రచయిత్రులు తమ రచనల ద్వారా సమాజాన్ని మేల్కొలిపారు. వీరి రచనలు కేవలం సాహిత్య స్రష్టలకు మాత్రమే కాక, కొత్తగా రచనా రంగంలోకి అడుగుపెట్టే వారికీ స్ఫూర్తి.