29-09-2025 12:00:00 AM
పఠాభి పేర్గాంచిన కవి తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి తన ‘ఫిడేలు రాగాలు డజన్’ రచనతో అధిక్షేప కవిగా వాసికెక్కారు. ఆ తర్వాత అధిక్షేప కవి ఎవరు.. అనే ప్రశ్న తలెత్తినప్పుడు పేర్వారం జగన్నాథం పేరే తెలుగు సాహిత్యరంగం నుంచి సమాధానం వస్తుంది. పఠాభి తరువాత రచనల్లో అంతమోతాదు వ్యంగ్యాన్ని, సందర్భోచితంగా ప్రయోగించిన ఒకే ఒక కవి జగన్నాథం అంటూ ఎందరో విమర్శకులు ప్రశసించారు. జగన్నాథం ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపాలెం మండలం ఖిలాషాపూర్‌లో 1934 సెప్టెంబర్ 23న జన్మించారు. ప్రాథమిక విద్య స్వగ్రామం, ఉన్నత పాఠశాల విద్య హనుమకొండలో సాగింది. హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడైన చొల్లేటి నరసింహశర్మ ప్రభావం జాగన్నాథంపై ఎక్కువగా ఉండేది. ఎంఏ చదివేకాలంలో దివాకర్ల వేంకటావధాని, కురుగంటి సీతారామయ్య, చెలమచర్ల రంగాచార్యులు, ఖండవల్లి లక్ష్మీరంజనం, బిరుదురాజు రామరాజు చెప్పిన పాఠాలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసిన జగన్నాథం తర్వాత కాకతీయ విశ్వవిద్యా లయంలో తెలుగు విభాగ ఆచార్యుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. వరంగల్ సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. 1992 వరకు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగి వర్సిటీ అభివృద్ధికి దోహదపడ్డారు. అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు, ఆరె భాషా నిఘంటువు, సాహితీ సౌరభం, సాగర సంగీతం, గరుడ పురాణం, వృషభ పురాణం, శాంతియజ్ఞం, ఆరె జానపద గేయాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు, సాహిత్యావలోకనం, నన్నయ భారతి, మోర్దోపు దున్న.. ఆయన ప్రసిద్ధ రచనలు. ‘ఆరె జానపదం సాహిత్యం తెలుగు ప్రభా వం’ ఆయన పరిశోధనా గ్రంథం. ఆచార్య రవ్వా శ్రీహరితో కలిసి సిద్ధం చేసి న గ్రంథం ఇది. ‘ఆరె’ అనే ప్రత్యేక తెగకు సంబంధించిన భాషా నిఘంటువు వెలువరించడం ఆయన ప్రతిభ కు కొలమానం.
ఆచార్యుడిగా దక్షిణ భారత విశ్వవిద్యాలయాల్లో జరిగిన అనేక సదస్సుల్లో పరిశో ధనా పత్రాలు సమర్పించారు. పాఠ్యప్రణాళికా సంఘ అధ్యక్షుడిగా కాకతీయ అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా, రాష్ట్ర సాహిత్య అకాడమీ సహాయ కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఉపాధ్యక్షుడిగా క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తించారు. వేల ఏళ్ల నుంచి ఒక లిపి అంటూ లేకుండా, ప్రజల నాలుకలపైనే సజీవంగా ఉన్న ఆ భాషకు ప్రాణంపో స్తూ జగన్నాథం నిఘంటువు రూపొందించారు. ఆధునిక తెలుగు సాహిత్యం లోనే గొప్ప అధిక్షేప రచన ‘వృషభ పురాణం’. ఈ రచనకు వృషభ పురా ణం అని పేరు పెట్టడంలోనే వ్యంగ్యం ధ్వనిస్తుం ది. పాల్కురికి సోమనాథుడు ‘బసవ పురాణం’లో సమాజ సంస్కరణే ధ్యేయంగా రచన సాగించగా, జగన్నాథం ‘వృషభ పురాణం’ పేరిట నైతికత లేని రాజకీయాలను, నాయకులను ఎత్తిపొడిచే విధంగా, విమర్శించే విధంగా కవిత్వం రాశారు.
‘రాజకీయ వృషభం’ గురించి ‘మరునాడు పొద్దు పొడవకముందే/ వైతాళికులు నిదురులేవగా/ బుద్ధగయలో బౌద్ధమతం స్వీకరించి / అశోక సామ్రాట్టు సమాధిపై పూలగుచ్ఛం సమర్పించి/ రాజధానికి తరలివస్తూ/ దారిలో కనపడ్డ గోవుల్ని వధ్యశిలకు పంపింది’ అంటూ రాసుకొస్తారు. తెలంగాణ ప్రాంత ప్రజల్ని పీడించిన నాయకులు, రజాకార్లు, స్వాతంత్య్రానంతరం రాజ ప్రముఖులుగా బిరుదులు, ఉన్నత పదవులు పొందడంపై ‘పూర్వాశ్రమంలో వారు పక్కా రజాకారు/ ప్రస్తుతం వారొక మంత్రి గారికి బావమరిది వారి పెద్ద కుమారుడు/ ఖాదీ బోర్డుకు అధ్యక్షుడిగా ఇటీవలే నామినేటెడ్’ అంటూ విమర్శనాస్త్రం సంధించారు. వృషభ పురాణంలోని ప్రతి కవితలో జగన్నాథం వ్యంగ్యవస్తువు ఆకట్టుకునేలా ఉంటుంది. వస్తువును ఎన్నుకోవడంతోపాటు దాన్ని తనదైన బాణీలో శక్తిమంతంగా వ్యక్తీరించడం జగన్నాథం ప్రత్యేకత.
‘సాగర సంగీతం’ సంకలనంలో ‘జాతికోసం జనుల కోసం కాగడానై కాలిపోదును’, ‘నీతి కోసం నిజం కోసం అగ్నికీలల నారగింతును’, ‘శాంతి కోసం సమత కోసం ఎదల లోపలి గదులు గూల్తును’ అంటూ మదిలోపలి భావాలను ఒలికించారు. ‘నాగార్జున సాగరమిది.. నాగార్జున సాగరమిది/ ఆంధ్రదేశ సంపదలకు ఆలవాలమైన చోటు/ ప్రతి ఇంటను రాశులతో బంగారం పంచిపెట్టు/ రైతన్న గరిసెలలో రతనాలే నింపుచుంద్రు/పల్లెటూరి జనం హర్ష బాష్పాలను రాలు చుంద్రు’ అంటూ జలనిధి నాగార్జునసాగర్‌ను కొనియాడారు.దేశాన్ని, జాతినీ మానవతనూ విస్మరించిన కవిత్వం నేల విడిచిన సాము లాంటిది. కేవలం నినాదాల్ని వల్లిస్తూ కవిత్వమని బుకాయించకుండా, రమణీయంగా వ్యంగ్య విలసితంగా చెప్పడమే నా లక్ష్యం’ అనేవారు పేర్వారం. ఆయన ప్రతిభకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలనెన్నో వరించాయి. 2008 సెప్టెంబర్ 28న కన్నుమూశారు.