30-09-2025 12:00:00 AM
ఎట్టకేలకు గ్రూప్-1 ఉద్యోగం సాధించా..
ఎల్లారెడ్డి వాసి మున్నం శశికుమార్
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) : నిరంతర కృషి, అంకితభావం, వైఫల్యాలను అడ్డుకట్టగా మార్చుకుని లక్ష్యం వైపు సాగిపోవడం... ఇవి ఎల్లారెడ్డి వాసి మున్నం శశి కుమార్ జీవిత సారాంశం. ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంక్, మల్టీ జోన్లో 54వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పదవిని చేపట్టిన శశి కుమార్, ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఉపాధ్యాయ వృత్తిలో 20 ఏళ్లుగా పనిచేస్తూనే, పరిశో ధనలు చేసి డాక్టరేట్ పొంది, అంతిమంగా గ్రూప్- 1 లక్ష్యాన్ని సాధించిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. శశి కుమార్ ఆయన తల్లిదండ్రులు మున్నం రాములు, మున్నం ఇందిరా ఇద్దరూ రిటైర్డ్ టీచర్లు. భార్య మమత కూడా టీచర్గా పని చేస్తున్నారు. 1996లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డిలో 10వ తరగతి పూర్తి చేశారు.
1998లో అదే ఊరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 2003లో బాన్సువాడలోని ఎస్.ఆర్.ఎన్.కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం దూరవిద్య ద్వారా మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేశారు. డా. బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హిస్టరీలో గోల్ మెడల్, ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు, భోజ్ యూనివర్సిటీలో ఫిజిక్స్. తెలుగు, హిస్టరీలో యుజిసి నెట్ అర్హత సాధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందారు.
అంతేకాకుండా, తెలుగులో పీహెచ్డీ చేసి 2024 లో డాక్టరేట్ సంపాదించారు. ఈ విద్యా సాధనలు ఆయనకు బలమైన పునాది వేశాయి. ఉద్యోగ ప్రస్థానం 2005లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా మొదలైంది. 2025 వరకు 20 ఏళ్లు ఈ వృత్తిలో పని చేశారు.
ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన పరీక్షల్లో జూనియర్ లెక్చరర్గా ఎంపికై, ప్రస్తుతం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిస్టరీ బోధిస్తున్నారు. అయితే, ఆయన అసలు లక్ష్యం గ్రూప్- వన్ సాధించడం.. 20 ఏళ్లుగా వైఫల్యాలు ఎదురైనా, భయపడకుండా ఉపాధ్యాయునిగా కొనసాగుతూ నిరంతరం కష్టపడ్డారు. మధ్యలో జూనియర్ లెక్చరర్ పదవి సాధించి, ఇప్పుడు గ్రూప్- 1 లో విజయం సాధించారు.