16-07-2025 12:02:25 AM
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి కుమారుడు కిరీటిరెడ్డి ‘జూనియర్’ అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ యూత్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ కాగా, జెనీలియా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా జూలై 18న విడుదల కానున్న నేపథ్యంలో జెనీలియా మంగళవారం విలేకరులతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు నా దగ్గరికి వచ్చింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత సౌత్‌లో చేస్తున్న సినిమా కాబట్టి చేయాలా.. వద్దా? అనుకున్నా. మా ఆయన రితేశ్ చాలా పాజిటివ్‌గా చెప్పి, కథ వినమన్నాడు. దర్శకుడు కథ గురించి, నా పాత్ర గురించి చెప్పిన విధానం ఎంతో నచ్చి ఒప్పుకున్నా. ఈ సినిమా ఒక అద్భుత ప్యాకేజ్. దేవిశ్రీప్రసాద్, సెంథిల్ కుమార్.. వీళ్ల అందరితో పనిచేయడం రీయూనియన్‌లా అనిపించింది.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చినందుకు రిగ్రేట్ ఏమీ లేదు. జీవితంలో అన్నీ ఉంటాయి. ఎన్నో అద్భుత సినిమాలు చేశాను. ‘బొమ్మరిల్లు’ హాసిని వెరీ మెమొరబుల్ క్యారెక్టర్. ‘హ్యాపీ’లో మధుమతి లాంటి పాత్రల పేరుతోనే ఇప్పటికీ నన్ను పిలుస్తుంటారు. నటిగా అది చాలా గొప్ప ఆనందాన్నిస్తుంది.
నా కోస్టార్స్ రామ్‌చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. నా ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.. వారిని సూపర్ స్టార్స్‌గా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.
ఇకపై యాక్టింగ్ కొనసాగిస్తా. చిన్న క్యారెక్టర్ అయినా గుర్తుండిపోయేది చేయడం ఇష్టం. రితేశ్‌తో ‘-మజిలీ’ రీమేక్ చేశాం. అది అద్భుతమైన విజయాన్నిచ్చింది. మరో మంచి లవ్‌స్టోరీ కుదిరితే చేయాలనే ఆలోచన ఉంది.
ఆరంభం నుంచి కొత్త కొత్త పాత్రలే చేస్తూ వచ్చా. ఈ సినిమాలోనూ నా పాత్ర చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఒక మంచి బాస్ క్యారెక్టర్. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఆ క్యారెక్టర్‌లో చాలా మార్పులొస్తాయి.
నేను ఇప్పటివరకు చాలామంది కొత్త నటులతో పనిచేశాను. కిరీటి డాన్స్, నటన అద్భుతంగా చేశాడు. కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి చాలా హార్డ్ వర్క్ చేశాడు. సెంథిల్, నేను ‘సై’ చేశాం. ఆయన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి అద్భుత సినిమాలు చేసొచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయనతో పనిచేయడం ఆనందంగా అనిపించింది.
కోట శ్రీనివాసరావు లాంటి గొప్ప నటుడితో ‘బొమ్మరిల్లు’లో నటించడం నా అదృష్టం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన లేకపోవడం సినిమా పరిశ్రమకు తీరని లోటు.