26-01-2026 01:22:43 AM
వీర పుత్రులు గన్న వసుంధరీ ఈ జనని
ధీర పుత్రులు వున్న పురంధరీ ఈ అవని
త్యాగాల నా తల్లి తనువెల్లా రగిలింది
బానిసత్వ బతుకుల్లో బాధల్ని దిగ మింగింది
కష్టాల కడలిలో కన్నీరు కార్చింది
చెరసాల చెలిమిలో చరితల్ని రాసింది
శరాలను సంధించిన విరోచిత పోరాటం
శరీరాలు బంధించిన ఆకాంక్షల ఆరాటం
అల్లూరి సారథిగా అడుగేసిన వెలుగు బాట
తెల్లోడి గుండెల్ని వణికించిన తెలుగు పాట
సత్యాగ్రహ శాంతిదూత గాంధీజీ నెహ్రూజీ
వీరగాధ ఛత్రపతి శివమెత్తిన శివాజీ
మీసాలను మెలిపెట్టిన భగత్సింగ్ సుభాసు
మోసాలను కనిపెట్టిన భరతమాతే శెభాసు
రాజ్యాంగ నిర్మాణము రాచబాట వేసిన రోజు
అంబేద్కరుడి ఆశయ వెలుగులు నిండిన రోజు
సమానత్వ ఉషస్సు ప్రసరించిన పండుగ రోజు
సర్వ సత్తాక ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన రోజు
బాధించిన పరతంత్రం స్వేచ్ఛా హృది ఆర్తి
సాధించిన స్వాతంత్రం విరజిమ్మిన త్యాగ దీప్తి
అలుపెరగని ధీరత్వం అదే మన దేశ స్ఫూర్తి
మువ్వన్నెల జెండాతో మురిసింది జాతి కీర్తి
-డాక్టర్ కటుకోఝ్వల రమేష్