26-01-2026 01:21:10 AM
31న గద్దర్ జయంతి :
అమ్మ నీకు వందానాలమ్మో
కమ్మని ప్రేమా నీదమ్మో
ఎటోళ్ల మట్టి చిప్పవో
ఎటోళ్ల మట్టి చిప్పవు
‘గాయిదోళ్ల గాండ్ర గొడ్డలివింౠ’ అం టూ.. తెలంగాణ సాధన కోసం ప్రజాయుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్) గర్జించారు.
‘భద్రంకొడుకో.. కొడుకో కొమరన్న జరా.. పైలం కొడుకో కొమురన్న జరా.. అంటూ గజ్జ కట్టి..గొంగడి భుజాన వేసుకుని పాడు తుంటే రక్తం ఉరుకుతున్నట్లు.. రిక్షా ఎక్కేకాడా..తొక్కేకాడా.. దిగేకాడా .. భద్రం అని ఊరు ప్రజలకు చెబుతుంటే.. ఆ జనం కళ్లలో వెలుగులు చూశాడు గద్దర్. మన ఊరు గానీ ఊరు..పల్లె కానీ పల్లె.. ఇది పట్నం కొడుకో.. కొమురన్న జరా అంటూ’ ముందుగానే యువతకు దిశా నిర్దేశం చేసిన ఘనత గద్దర్ కు మాత్రమే దక్కుతుంది.
‘జామ్ జమల్మా ర్రి.. వెయ్య్ కలజారీ అంటూ.. జాలి లేని లోకం.. అరే జబ్బర్ద్దస్త్ లోకం.. ఆ న్యాయమైన నేరం, ఈ నేటి నీతి సారం.. ఆ ఒకరి సుఖం కోసం.. ఇంకొకరి బాధ మో సం.. మనిషి మీద మనిషికే.. మమకారం లేదు’.. అంటూ జాతీ నీతిని, లోకం పోకడను కళ్లకు కట్టినట్లు పాడి.. ఎంతో మందికి కనువిప్పు అయ్యేలా చేశారు గద్దర్. స్వరాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర విశిష్టమైనది. అనన్య సామాన్యమైనది. ప్రపంచంలో మరే ఇతర వాగ్గేయకారుడికి తక్కువ కాకుం డా ఆయన జీవిత కాలాన్ని స్వరాష్ట్ర సాధన కోసమే అర్పించారు.
పాల్స్ రాబ్సన్, మైఖేల్ జాక్సన్, బాబ్ మార్లే.. తదితర ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రజాకవుల కంటే ఏ మాత్రం తీసిపోని కవి. ఆయన అచ్చమైన తెలంగాణ యాసలో, ఈ ప్రాంత వాద్య చప్పుళ్ల నేపథ్యంలో పాట పాడుతుంటే.. గజ్జె కట్టి ఉవ్వెత్తున దుంకి ఆడు తుంటే.. అంతకముందు గద్దర్ గురించి తెలియని వారు సైతం ఒక్కసారి అలా నించుని స్థాణువైపోవాల్సిందే.. ఆయన పాట పాడుతుంటే కరకు రాతి గుండ్లునా కరిగిపోవాల్సిందే.. ఉద్య మం అంటే తెలియని వారి గుండెల్లో బరా లు పేలాల్సిందే.. అంత గొప్ప వాగ్గేయకారుడి జయంతికి ఇదే అక్షర నివాళి.
గద్దర్ కనిపిస్తే చాలు...
ప్రజాయుద్ధ నౌక గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో జన్మించారు. లచ్చ మ్మ, శేషయ్య దంపతులకు 1949 జనవరి 31న ఆయన పుట్టారు. పేదరికంలో పెరిగిన విఠల్ రావు తన చుట్టూ ఉన్న సామాజిక అసమానతలను చూసి చలించిపోయారు. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే విప్లవ భావాల వైపు ఆకర్షితులయ్యారు. పాటను ఆయుధంగా మలుచుకుని పీడిత ప్రజల పక్షాన నిలబడ్డారు. కెనరా బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాన్ని వదిలి పూర్తిస్థాయి ప్రజా ఉద్యమాలకు అంకితమయ్యారు.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో గద్దర్ తన గళాన్ని వినిపించారు. 1969 ప్రత్యేక రాష్ట్ర పోరాటం లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత కాలంలో పీపుల్స్ వార్ గ్రూపులో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. 1980 చివరి నాటికి, 1990ల ఆరంభంలో గద్దర్ పాట ప్రభంజనంలా సాగింది. 1990లో హైదరాబాద్‌లో జరిగిన జననాట్య మండలి మహాసభల వేదికపై ఆయన పాట పెను సంచలనం సృష్టించింది. ఆ సభకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అప్ప ట్లో గద్దర్ కనిపిస్తే చాలు జనం పరవశించిపోయేవారు. ఆయన పాట వినడానికి ఊళ్ల కు ఊళ్లు తరలివెళ్లేవి. ఆయనకు వచ్చిన విపరీతమైన క్రేజ్ చూసి పాలక వర్గాలు వణికి పోయేవి.
గద్దర్ కేవలం తెలంగాణ వాదమే కాకుం డా దళిత, పీడిత వర్గాల గొంతుకగా మారా రు. 1985లో జరిగిన కారంచేడు నరమేధం ఆయనను తీవ్రంగా కలచివేసింది. అలాగే 1991 చుండూరు ఘటన తర్వాత దళిత మహాసభలో గద్దర్ కీలక పాత్ర పోషించా రు. ఆ దారుణ మారణకాండను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ రక్తపాతాన్ని ఒక హృదయవిదారకమైన ఒగ్గుకథగా మార్చి ఊరూరా వినిపించారు. ‘కారంచేడు కదనరంగంలో కడదాక పోరాడి నిలిచిన మా అన్నలారా’ అం టూ పాడారు. దళిత ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి తన పాటతో అండ గా నిలిచారు. భూమి కోసం, భుక్తి కోసం సాగిన పోరాటా ల్లో గద్దర్ పాట ఒక నిరంతర చైతన్యమై ప్రవహించింది.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో..
గద్దర్ పాటలు కేవలం వినోదం కోసం కాదు. అవి ప్రజలను చైతన్యపరిచే మందుపాతరలు. ‘బండి వెనక బండి కట్టి పదహారు బం డ్లు కట్టి.. ఏ బండిలో వస్తావు కొడుకో నైజా ము సర్కరోడా’ అంటూ భూస్వామ్య వ్యవస్థను గడగడలాడించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. తోడబుట్టిన రుణం తీర్చు కుంటానే చెల్లెమ్మా’ అంటూ చెల్లెలిపై ప్రేమ ను తాను వ్యక్తం చేశారు. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అనే పాట రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించింది.
ఈ పాట వింటే ప్రతి గుండె ఉప్పొంగిపోయేది. ప్రతి సభలోనూ ఈ పాట ధ్వనించనిదే కార్యక్రమం ముందుకు సాగేది కాదు. ఆయన కవితా వస్తువులు చాలా విభిన్నంగా ఉండేవి. సమాజంలో ఎవరూ పట్టించుకోని చీపురు, చెత్తకుండీలను తన పాటల్లో శిల్పాలుగా మలిచారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను పాటలుగా మార్చారు. ఆడపిల్లల వేదనల ను, తెలంగాణ పల్లె బతుకులను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. అమరవీరుల త్యాగాలను ప్రతి గడపకు చేరవేశారు.
సామాన్య ప్రజల భాషను, యాసను గొప్ప సాహిత్యంగా మార్చిన ఘనత గద్దర్‌కే దక్కుతుంది. గొంగడి వేసుకుని, చేతిలో కర్ర పట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి గద్దర్ ఆడుతుంటే అది ఒక సామాజిక యుద్ధంలా అనిపించేది. దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో ఉన్న గద్దర్ ఆ తర్వాత బయటకు వచ్చారు. ప్రజాస్వామిక పంథాలో తెలంగాణ సాధన కోసం పోరాడారు. తనపై జరిగిన కాల్పుల ఘటనను సైతం ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు.
తన శరీరంలో తూటా ఉన్నా లెక్క చేయకుండా ప్రజల కోసం గళం ఎత్తారు. తన గొంతు మూగబోయే వరకు తెలంగాణ గడ్డపై పాటను బతికించారు. ప్రజా పోరాటాల్లో ధ్రువతారగా నిలిచిన ఈ మహోన్నత కళాకారుడు 2023 ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాట నిరంతరం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
రతన్ రుద్ర