25-12-2025 12:43:15 AM
గజ్వేల్, డిసెంబర్ 24(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీలోని భేదాభిప్రాయాలు మరోసారి బయటపడ్డాయి. ప్రభుత్వ పదవులున్నా పార్టీలో తగిన గౌరవం ఇవ్వడం లేదని, విలువ లేని పార్టీలో నేనుండనని ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ ఒంటేరి యాదవరెడ్డి ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావుతో తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థులకు పార్టీ ఫండ్ దాదాపు రూ. 2 కోట్ల వరకు నియోజకవర్గానికి వచ్చింది.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇవ్వలేదనుకుని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తన సొంత డబ్బును తన వద్దకు వచ్చిన పార్టీ నుంచి పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులకు ఇచ్చారు. కానీ నియోజకవర్గంలోని సర్పంచ్ అభ్యర్థులకు పార్టీ ఫండ్ దాదాపు రూ. 2 కోట్లు వచ్చినట్టు, ఆ డబ్బులను బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థులకు లక్ష చొప్పున ఇచ్చినట్లు పలువురి ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మనస్థాపానికి గురయ్యారు.
అయితే తనకు నచ్చిన వారికే ఎక్కువ పార్టీ ఫండ్ ప్రతాపరెడ్డి ఇచ్చినట్టు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వర్గ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. కాగా ఎన్నికల అనంతరం గెలిచిన బిఆర్‌ఎస్ సర్పంచులను సన్మానిం చడానికి గత కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేయగా, హాజరు కావడానికి వచ్చిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో ఈ మేరకు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఫోన్లో చర్చించినట్లు సమాచారం.
తనకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని, కనీస సమాచారం ఉండడం లేదని, తన పదవికి కూడా విలువ ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్పంచుల సన్మాన కార్యక్రమం వాయిదా పడింది. విలువ లేని పార్టీలో తాను ఉండనని, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
కొందరు నాయకులు నియోజకవర్గంలో పార్టీని పాడు చేస్తున్నారని, కేసీఆర్‌ను కూడా ఇష్టం వచ్చినట్లుగా ఇతర నాయకులు, కార్యకర్తలు ముందు తిడుతున్నారని, ఇదంతా విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.ఈ విధంగా ఉంటే పార్టీ ఎటు పోతుందోనన్న అనుమానాలు ఆలోచనలు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తల్లో మెదులుతున్నాయి.