25-12-2025 12:44:27 AM
డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్, డిసెంబర్ 24(విజయక్రాంతి): మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్ జిల్లాకు చేసిన సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం మల్లికార్జున్ వర్ధంతి నిర్వహించారు. స్థానిక పద్మావతికాలనీలోగల మల్లికార్జున్ విగ్రహానికి, పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ మల్లికార్జున్ మెడికల్ కోర్సును అభ్యసించిన కాలంలోనే తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారని గుర్తు చేశారు.
ఎంపీగా తనను ఆదరించిన జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అనేక పథకాలు, నిధులు మంజూరు చేయించారని అన్నారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఫ్లేవర్ బ్రిడ్జి, వీరన్నపేట వద్ద టౌన్ రైల్వే స్టేషన్, దూరదర్శన్ రిలే కేంద్రం, రామన్పాడు తాగునీటి పథకం ఆయన హయాంలోనే మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగుదామని తెలిపారు.
మల్లికార్జున్ సతీమణి భాగ్యలక్ష్మి కుమారుడు మను మాట్లాడుతూ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద మల్లికార్జున్ విగ్రహం పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నారాయణపేట డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు చంద్రకుమార్ గౌడ్, జహీర్ అఖ్తర్, సీజే బెనహర్, గోపాల్ యాదవ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, షబ్బీర్, లింగం నాయక్, అవేజ్, అజ్మత్‌అలీ, ఆంజనేయులు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.