21-07-2025 01:33:16 AM
- ఉప ఎన్నికపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
- మోదీ, అమిత్‌షాలకు ప్రచారకుడిగా పనిచేస్తా
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని భర్తీ చేసిన క్రమంలో అలక వహించి పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆదివారం ఎమ్మెల్యే పదవి రాజీనామాపై స్పందించారు. లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. తాను బీజేపీని వీడినా ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎంఐఎంతో అంటకాగుతోన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తాను పక్కా హిందూ నేతనని, దేశానికి సేవ చేస్తున్న ప్రధాని మోదీ, అమిత్‌షా లకు ప్రచారకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాటం చేస్తానని తెలిపారు. బీజేపీ అధిష్ఠానంపై ఎలాంటి వ్యతిరేక భావం లేదన్నారు. బీజేపీ నుంచి గెలిచిన తాను అధిష్ఠానం ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో తనకు తెలియదన్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.