calender_icon.png 25 November, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవి కస్టడీ పూర్తి

25-11-2025 12:00:00 AM

  1. ఐదు రోజుల విచారణలో కీలక సమాచారం!
  2. టెలిగ్రామ్‌లో పైరసీ చిత్రాల కొనుగోలు, బెట్టింగ్ యాప్‌ల ప్రచారంతో భారీ ఆదాయం?
  3. కస్టడీ ముగియడంతో చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): సినిమా పైరసీ కేసులో, ఐబొమ్మ, బొప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీ సోమ వారంతో ముగిసింది. కస్టడీలో భాగంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నుంచి అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణలో రవి బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది.

కస్టడీ అనంతరం పోలీసులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి, నాంపల్లి కోర్టులో హాజరుపరిచి, అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఐదు రోజుల విచారణలో పోలీసులు రవి నేర సామ్రాజ్యపు మూలాలను శోధించారు. ఇప్పటివరకు రవి ఒక్కడే ఈ పైరసీ కార్యకలాపాలు నడిపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కొత్త సినిమాలను టెలీ గ్రామ్ ద్వారా కొనుగోలు చేసి, తన వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు.

వెబ్ సైట్లను ఓపెన్ చేసిన వినియోగదారులకు ఏపీకే లింకులు పంపి, వాటి ద్వారా బెట్టింగ్ యాప్‌లను పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు తేల్చారు. ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల ద్వారా వచ్చిన కోట్ల రూపాయల నిధులను, సూరత్  లోని ఐడీఎఫ్‌సీ   బ్యాం కు ఖాతాకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. అతని సర్వర్లు, ఐపీ అడ్రస్‌లు, విదేశా ల్లోని నెట్‌వర్క్‌పై ఆరా తీశారు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో సాంకేతిక అంశాలను లోతుగా పరిశీలించారు.

అతని బ్యాంక్ లావాదేవీలు, బెట్టింగ్ యాడ్స్ ద్వారా వచ్చిన సొమ్మును ఎలా వాడాడు, ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్లను ఎలా కొనుగోలు చేశాడు అనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే, విచారణకు రవి పూర్తి గా సహకరించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. నాలుగో రోజు విచారణలో చాలా ప్రశ్నలకు గుర్తులేదు, మర్చిపోయాను వంటి సమాధానాలు ఇచ్చి విచారణను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.

మరోవైపు, ఈ వాదనను రవి తరపు న్యాయవాది శ్రీనాథ్ ఖండించారు. పోలీసుల ఆరోపణలు అవాస్తవమని, రవి విచార ణకు పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు కాగా, ఒక కేసులోనే రిమాండ్ విధించారని, మంగళవారం రవి బెయిల్‌పై వాదనలు జరగను న్నాయని ఆయన వెల్లడించారు. నిందితుడిని ఈ నెల 27న తిరిగి కోర్టులో హాజరు పరచాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.