03-07-2025 01:56:29 AM
-ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్
-రూ.3.65 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మెదక్, జూలై 2(విజయక్రాంతి): అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన తర్వాత ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరిచేందుకు 30 కోట్ల రూపాయలతో మెదక్ చర్చి, అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశామన్నారు.
మెదక్ మున్సిపాలిటీ పరిధిలో రూ.3.65 కోట్లతో సుభాష్ నగర్ కాలనీలో కోటి 40 లక్షలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన, రూ.2.13 కోట్లతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిలో మేయిన్ గేట్ నుండి చర్చి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. 8 లక్షల రూపాయల వ్యయంతో వెంకట్రావు నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. వచ్చే నాలుగేళ్లలో మెదక్ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.