21-12-2025 12:18:49 AM
ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ తిరిగే కథతో సినీప్రియులకు సరికొత్త అనుభూతి పంచేందుకు ముస్తాబవుతున్న హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. ‘రాజు వెడ్స్ రాం బాయి’ హీరో అఖిల్‌రాజ్‌తోపాటు త్రిగుణ్ ఇందులో కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బాపటేల్ కథా నాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకుడు.
హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వేంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన దక్కించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే సడన్ ట్విస్టులను, హారర్ సీన్స్‌ను హార్ట్‌వీక్‌గా ఉన్న వాళ్లు చూడకూడదని మేకర్స్ నుంచి వార్నింగ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ‘ఈషా’ వార్నింగ్ పేరిట శనివారం మరో వీడియోను విడుదల చేశారు.
ఇప్పటివరకు వచ్చిన హారర్ థ్రిల్లర్ జానర్‌లో వార్నింగ్ పేరిట ఇలాంటి వీడియోను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఇక తాజా వీడియోను గమనిస్తే.. ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. ‘మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది’ అంటూ ట్రైలర్‌ను ఆసక్తికరంగా మలిచారు. ‘మనుషుల్లాగే కొన్నిస్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి.. తర్వాత అవి క్రమంగా ఆత్మలకు నిలయాలుగా మారుతాయి’ అంటూ ఈ వీడియోలో వార్నింగ్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు.