22-01-2026 12:19:17 AM
సీనియర్ సివిల్ జడ్జి కవితా దేవి
జహీరాబాద్, జనవరి 21: మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కవితా దేవి సూచించారు. మంగళవారం జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన మోటర్ వెహికల్ చట్టం అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనాలు కొనుగోలు చేసినవారు వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్ట ప్రకారంగా శిక్షించాల్సి వస్తుందని తెలిపారు.
జిల్లా ఎస్పీ పంకజ్ పారితోషి మాట్లాడుతూ, రోడ్డుపైన నడిచే అన్ని వాహనాలకు ఒకే మోటార్ వెహికల్ చట్టం అమలవుతుందన్నారు. చట్టాన్ని అనుసరించి వాహనాలు నడపాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబ సభ్యులు రోడ్డు పాలు అవుతారని సూచించారు. మోటార్ వెహికల్ చట్టం అనుసరిస్తూ క్రమ పద్ధతిలో వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ తహసిల్దార్ దశరథ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, డి.ఎస్.పి సైదా నాయక్, సిఐలు శివలింగం, జక్కుల హనుమం తు, ఎస్త్స్రలు వినయ్ కుమార్, కాశీనాథ్, రాజేందర్ రెడ్డి, పటేల్ క్రాంతి కుమార్, నరేష్, దోమ సుజిత్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.