calender_icon.png 1 February, 2026 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారసులు బుద్ధిమంతులైతేనే!

25-09-2024 12:00:00 AM

బుద్ధిమాన్, ఆహార్యబుద్ధిః 

దుర్బుద్ధిః ఇతి పుత్రవిశేషాః

- కౌటిలీయం: -1-17

పుత్రులు (వారసులు) బుద్ధిమంతు డు, ఆహార్యబుద్ధి, దుర్బుద్ధి అని మూడు విధాలుగా ఉంటారంటున్నాడు ఆచార్య చాణక్య. “యుక్తాయుక్త విచక్షణా జ్ఞానా న్ని పొంది, దానిని శ్రద్ధతో ఆచరించేవాడు బుద్ధిమంతుడు. విషయం తెలిసి నా దానిని ఆచరించనివాడు ఆహార్యబుద్ధి. జ్ఞానాన్ని పొందకుండా అన్నింటినీ ద్వేషిస్తూ అపాయాలకు కారణమయ్యేవాడు దుర్బుద్ధి” అంటారాయన. 

హితకారుడై తండ్రి ఆహార్యబుద్ధి, దు ర్బుద్ధులైన సంతానానికి కూడా అవసరమైన శిక్షణనిచ్చి సంస్కరించేందుకు ప్ర యత్నించాలి. ఒక సంస్థలో పని చేసే ఉ ద్యోగులను కూడా మూడు విధాలుగా చూడవచ్చు. తాము పొందిన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి సృజనాత్మకంగా పనిచేస్తూ సంస్థ అభ్యుదయానికై నిరంతరం కృషి చేసేవారు బుద్ధిమంతులు.

వీరు తమకు అప్పగించిన పనిని గుడ్డిగా అనుసరించరు. తమ ఆలోచనలకు పదను పెట్టి, బుద్ధితో విచారిస్తూ ఆశించిన లక్ష్యా న్ని అధిగమించి ఫలితాలను సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు. హేతుబద్ధమై న, ఆచరణాత్మకమైన ఆలోచనలతో తమ పరిమితులను, పరిధులను దాటి ముం దుకు సాగుతూ, అంచనాలకు మించి అనూహ్యమైన ఫలితాలను సాధిస్తుంటారు.

ప్రతి సమస్యనూ విశ్లేషణాత్మకం గా పరిశీలిస్తూ లక్ష్యాలను అధిగమిస్తూ సంస్థను ఉన్నత స్థానంలో నిలిపేందుకు తమ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తుంటారు. పనిని ఉపాస్యదైవంగా భావిస్తూ ఫలితాలపైకాక ప్రక్రియపై దృష్టి పెట్టే వీరి నేతృత్వంలో సంస్థ ఉన్నతిని సాధిస్తుంది. 

నేను సాధించగలననే వైఖరితో తమకు తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. వీరినే ‘వైల్డ్ డక్స్’గా పిలుస్తుంటారు.

కొందరికి విజ్ఞానం, వివేచన ఉంటుం ది. కాని, దానిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించరు. ప్రవాహంతో సాగిపోయేందుకు ఇష్టపడతారే కాని, భిన్నంగా ఆలోచించేందుకు సమ్మతించరు. సౌకర్యవంతమైన వలయంలో ఉండేందుకు ఇష్టపడతారే కాని, తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపరు. కొత్త సాంకేతికతను అన్వయించుకునేందుకు ఆసక్తి చూపని వీరివల్ల సంస్థకు ప్రయోజనం ఉండదు.

అలాగని అపాయమూ ఉండదు. ఇక, దుర్బుద్ధి కలిగిన ఉద్యోగులవల్ల అపాయం అధికంగా ఉంటుంది. వారు చేయరు, చేసే వారిని చేయనీయరు. ప్రతి పనిలో అడ్దంకులు సృష్టిస్తూ, నిరర్థక వాదనలతో కాలం గడిపేస్తుంటారు. నకారాత్మక వైఖరి కలిగిన వీరి ప్రవర్తన సంస్థలోని మిగతా ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు సహకరిస్తుంది.సంస్థ ఉత్తమ ఫలితాలను సాధించి ఉన్నత స్థానంలో నిలవడం సులువే కావచ్చు. కాని, ఆ స్థానాన్ని నిలుపుకోవడం కష్టతరం. 

అనర్హులకు అందలాలు వద్దు

ఎన్నో కష్టనష్టాలకోర్చి, అహర్నిశలూ శ్రమించి సంపదను సృజించిన తల్లిదండ్రులు తమ సంతానానికి తగిన శిక్షణను ఇచ్చినా వారసులు సమర్థులు కాకపోతే ఆ సామ్రాజ్యం కూలిపోవచ్చు లేదా పరహస్తగతం కావచ్చు. అయితే, వారిలో సమర్థులను, బుద్ధిమంతులను గుర్తించి వారికి ఉన్నత శ్రేణి లక్ష్యాలను నిర్దేశించి, వారి పనితీరును పరిశీలిస్తూ, తగిన విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తే సంస్థ ఉన్నత స్థానంలో కొనసాగుతుంది.

ఉద్యోగులలో అసమర్థులకు కూడా వారికి తగిన స్థాయిలో అవసరమైన శిక్షణను అందిస్తూ, పలు కీలక నిర్ణయాలలో భాగస్వాములను చేయడం ద్వారా వారి లో ఉత్సాహాన్ని నింపవచ్చు. నాయకుల ప్రభావవంతమైన పని తీరే సంస్థను ఉ న్నతీకరిస్తుంది. ప్రతిభ ఆధారంగా ఉత్తమ స్థాయి వారసులకు సంస్థ బాధ్యతలను అప్పగించే సమయంలో, అనర్హులకు ఆ స్థానాన్ని కాదని చెప్పే తెగువ నాయకునిలో ఉండాలి. 

అగ్రదేశాలలో ఉద్యోగం సంపాదించడం సులువే కాని, దానిని నిలుపుకునేం దుకు అనుక్షణం తమ ప్రతిభకు మెరుగులు పెట్టుకోవాలని చెపుతారు. ‘నీ దారేదో నీవు అన్వేషించు’ అన్న సూత్రం అమలైతే వారసుల ప్రతిభ వికసిస్తుంది. అయితే, ఎవరి స్థాయి ఏమిటో గుర్తించి వారికి ఆ బాధ్యతలను అప్పగించడంలోనే నాయకుని ప్రతిభ వెలుగుచూస్తుం ది. సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఎవరి స్థాయి ఎక్కడో తెలిసి దానిని ఉన్నతీకరించుకోవడంలోనే వికా సం ఉన్నది.

పాలకుర్తి రామమూర్తి