calender_icon.png 17 May, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడి కడుపు నిండుతుంటే.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు కడుపుమంట

12-04-2025 12:00:00 AM

  1. సన్నబియ్యం సంబురాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలి 

పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

సన్నబియ్యం, ధాన్యం కొనుగోళ్లపై పార్టీ నేతలతో మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాం తి): సన్న బియ్యం సంబురాల్లో కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని, ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ కాం గ్రెస్ నాయకులు రైతులకు సహకరించాల ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ నిరుపేదకు సన్నబియ్యం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. 2.80 కోట్ల మందికి బియ్యం పంపిణీ చేయగా.. ఇప్పుడు మనం 3.10 కోట్ల మందికి ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ప్రజలు వాటిని తినలేదని, ఆ బియ్యం పక్కదారి పట్టాయన్నారు. అందుకే మనం చరిత్రలో నిలిచిపోయేలా సన్నబియ్యం అందించాలని నిర్ణయం తీసుకున్నామని, ముందుగా రూ.500 బోనస్ ఇచ్చి సన్న ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులంతా సమష్టిగా తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

పేదలకు సన్నంబియ్యం అందిస్తుంటే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కడుపుమంటతో మాట్లాడుతున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2.8 కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇచ్చేందుకు గతంలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేవారని, ఇప్పుడు 3.10 కోట్ల మంది లబ్ధిదా రులకు సన్నబియ్యం ఇవ్వడానికి మన ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత కూడా రికార్డు స్థాయిలో 66.7 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండిందన్నారు. 

10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పండని పంట కాంగ్రెస్ హయంలో పడిందని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కచ్చితత్వంతో ఉన్నామని, రైతులకు మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరికి మద్దతు ధరతో పాటు బోనస్‌కు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు.

సన్న బియ్యం పంపిణీపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాల్సిన అవసరం కాం గ్రెస్ శ్రేణులపై ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయమని, ఉగాది, రంజాన్ సందర్భంగా పురస్కరించుకొని బియ్యం పంపిణీని ప్రారంభించ డం ఆనందాన్నిచ్చిందన్నారు. రేషన్ షాపు ల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.

సన్నబియ్యంతో పేదవాడి ఇంట్లో అసలైన పండుగ మొదలైందన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయాలని.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఈ మూడింటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు.