07-09-2025 12:50:05 AM
‘వెన్నెల దీపం కొందరిరా.. అడవిని సైతం వెలుగు కదా.. ఎల్లలు లేని చల్లని గాలి, అందరి కోసం అందును కాదా.. ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదేపదే చూపే ప్రధాన మార్గం. ఏది స్వంతం కోసం కాదను సందేశం. పంచే గుణమేపోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద’ అంటాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇందులో నిగూఢమై న త్యాగం (సేవ) దాగి ఉందనేది కొందరికే తెలుసేమో బహుశా..! వెన్నెల, గాలి, సూర్యు డు, చంద్రుడు, వసంతం, ఇవి అన్నీ ప్రకృతి భాగాలు.
ఇవి ఏవి వాటి సొంత ప్రయోజనం ఆశించి పని చేయవు. సహజసిద్ధంగా వాటి పని అవి నిస్వార్థంగా చేసుకుంటూపోతాయి. మరి మనిషి కూడా ప్రకృతి నుంచే వచ్చాడు. ప్రకృతిలో భాగమే కానీ ‘స్వార్థ్యం’ అసూయ అతడి మనసును ఆవహిస్తోంది. ఫలితంగా ‘చెడు ఆలోచనలు’ దాని ద్వారా వచ్చే ‘చెడ్డ పనులు’. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి పాటుపడవోయ్ అంటాడు మహాకవి గురజాడ. పొరుగువాడికి సహాయం చేయని మనిషి మనిషేనా? మీరు ఎవరితో అంటీముట్టనట్టు ఉంటే మిమ్నల్ని మాత్రం ఎందుకు పట్టించుకుంటారు ఆపదలో ఉన్నప్పుడు.
‘సమాజం’ అంటేనే మీ చుట్టూ ఉండే మనుషుల కలబోత. వారితో మీరు ఎలా మసులుకుంటున్నారనేది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. దాని ఫలితమే ఇతరులు మిమ్మల్ని ఎలా గౌరవిస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే వీలైనంత వరకు మీ ప్రేమను సమాజానికి, మీ చుట్టూ ఉండే వారికి, మీ మీద ఆధారపడే వారికి, పిల్లలకు, పెద్దలకు, మీ చుట్టూ ఉండే వారికి, ప్రకృతికి, తోటి ప్రాణులకు పంచండి. దాని ఫలితం మీకు తిరిగి ప్రేమే వస్తుంది. ఈ సందర్భంగా ఓ చిన్న కథ చదవండి.
ఒకవ్యక్తి తన భార్యకు బాగా ఇష్టమైన మామిడి చెట్టు ఉన్న ఇల్లు కొనాలనుకుంటాడు. బంధువులు, తెలిసిన వారు వాస్తు ప్రకారం ఉందా లేదా అని చూయించుకోవాలని పట్టుబడతారు. ఒక ఇల్లును చూసి అది వాస్తు ప్రకారం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఒక వాస్తు సిద్ధాంతి వద్దకు వెళ్తాడు. ఆ వాస్తు సిద్ధాంతిని తీసుకొని తను కొనాలనుకున్న ఇంటిని చూయించడానికి కారులో బయలుదేరుతాడు. ఇలా వచ్చే క్రమంలో వారి వాహనం వెను నుంచి ఎవరు వచ్చి హారన్ కొట్టినా వారికి దారి ఇచ్చి వారిని వెళ్లమనేవాడు.
ఇది గమనించిన వాస్తు సిద్ధాంతి ఎందుకిలా చేస్తున్నారని అడిగితే వారికి మనకన్నా ఇంకా ఏమైనా అత్యవసరం ఉండి ఉండొచ్చు.. వారికి మనం దారి ఇస్తే త్వరగా వారు చేరాల్సిన గమ్యానికి చేరుకుంటారు కదా అంటాడు. అలా కొన్న ఇంటి దగ్గరికి వారి కారు వచ్చే క్రమంలో ఒక పిల్లవాడు ఆడుకుంటూ కారు ముందుకు వస్తాడు. వెంటనే కారు ఆపి పిల్లవాడికి దారి ఇస్తాడు. కొద్ది సేపటికి ఆ సిద్ధాంతిని ఇంకా ఎవరైనా వస్తున్నారా చూడండి అని అడుగుతాడు. ఆ క్రమంలో రెండో పిల్లవాడు వారి కారు ముందు నుంచి వెళ్లిపోతాడు.
అప్పుడు సిద్ధాంతి మీరు ఎలా ఊహించారు? అని అంటాడు. అప్పుడు అతను పిల్లవాడు ఒక్కడే ఆడుకోడు కదండి. కాబట్టి కొద్దిసేపు ఆగాను అంటాడు. అలా ఇంటి ముందుకు రాగానే మామిడి చెట్టుపై నుంచి ‘పక్షులు ఎగిరిపోవడం’ చూసి కారు యజమాని గురువు గారు ఇప్పుడే కారు దిగకండి. మనం కారులోనే ఉండి వాళ్లు వెళ్లాక వెళ్దాం అంటాడు. కానీ ఆ ‘వాస్తు గురువు’ ఇక్కడ ఎవరు లేరు కదా! అని మనసులో అనుకుంటూ చూస్తుండగానే కొంతమంది పిల్లలు వచ్చి ఆ మామిడి చెట్టుకు రాలిన పండ్లను తీసుకొని వెళ్తారు.
అది చూసి షాకైన గురువుగారితో నవ్వుతూ ఇలా అంటాడు. పిల్లలు పక్షులను రాళ్లతో కొడితేనే కదండి అవి ఎగిరిపోయాయి. ఇప్పుడు వారు మనల్ని చూస్తే ఇంకా భయపడిపోతారు. కాబట్టి వారు వెళ్లాక వెళ్దాం అంటాడు. లేకపోతే వారు కంగారుపడి, భయంతో పరుగుతీసే క్రమంలో కిందపడితే దెబ్బలు తగులుతాయ్ అంటాడు. మరో రెండు అడుగులు వేశాక గురువు గారు పక్కింటి వారు మనల్ని చూస్తుంటారు వారిని పలకరించి వెళ్దాం అంటాడు. దానికి గురువు గారు వారు మన గురుంచి ఎందుకు ఆలోచిస్తారు? అని అడగగా ఈ ఇంట్లోకి ఎలాంటి వారు వస్తున్నారో, వారితో మనకేమైనా ఇబ్బందులుంటాయేమోనని దిగులుంటుంది వారికి.. వారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు.
మనం ఈ ఇంటికి కొత్తగా రాబోతున్నా. కాబట్టి వారికి దిగులు సహజంగానే ఉంటుంది కదండీ అంటాడు. అప్పుడు గురువుగారు ఇలా అంటాడు.. వాస్తు అంటే ప్రకృతి, పరిసరాలు, మంచి మనస్సు, పక్షులు వాటి ప్రశాంతతను గౌరవించడం, అలాగే అన్నింటిలోనూ మంచిని చూస్తూ అందరికి సహాయపడే గుణం ఉన్న మీ లాంటి మంచి మనసున్న వారికి వాస్తు ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది. ఎప్పుడు శుభమే జరుగుతుంది. కానీ సమాజాన్ని ప్రేమించే వారిని ఇంటివారు చిన్నచూపు చూస్తారు. అదొక్కటి మనసులో ఉంచుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు. చూశారుగా మీరు కూడా ఎవరిలోనైనా మంచిచే చూడండి, చెడ్డ వ్యక్తులు, మంచి వ్యక్తులు అనే వారు మనం అనుకునేవే. ‘మనలో లోపం లేనివాడు ఎవడో చెప్పండి’ అంటాడు సినారే. అందుకే లోపాన్ని కాదు వెతికేది మంచిని వెతకండి. లేదా పంచండి. మీకు కూడా మంచే ఎదురొస్తుంది.
డాక్టర్ మహ్మద్ హసన్,అసిస్టెంట్ ప్రొఫెసర్ సెల్: 99080 59234