07-09-2025 12:51:19 AM
అఖండ భారత్‌ను స్వాధీనం చేసుకోవాలనే వాంఛతో, అపార ధనరాశులపై కాంక్షతో భారత్‌పై దండెత్తి వచ్చిన అఫ్ఘాన్ పాలకుడు మహ్మద్ ఘోరీకి రాజ్‌పుత్ రాజు పృథ్విరాజ్ చౌహాన్ సేనలు చుక్కలు చూపించాయి. తమకు ఎదురేది అని విర్రవీగుతూ యుద్ధరంగంలోకి దిగిన సేనలకు చౌహాన్ సేనలు ఓటమి రుచిని చూపెట్టాయి. చేసేదేం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఘోరీ వెళ్లిపోవాల్సి వచ్చింది.
మధ్యయుగ భారతంలో దండయాత్రలకు కొదువ లేదు. సామంత రాజులపై అనేక మంది ముస్లిం సుల్తానులు దండయాత్రలు చేసి అపార ధనాన్ని కొల్లగొట్టారు. చిన్న రాజ్యాలను ఛిన్నాభిన్నం చేశారు. ఈ దండయాత్రలకు మహ్మద్ ఘోరీ పునాది వేశాడు. అఫ్ఘాన్‌లోని ఓ చిన్న రాజ్యానికి అధిపతి అయిన ఘోరీ అఖండ భారత్‌ను శాసించాలని నిర్ణయించుకున్నాడు. 1191లో ఘోరీ మహ్మద్, రాజ్‌పుత్ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ మీద దండెత్తాడు.
కానీ పృథ్విరాజ్ చౌహాన్ సేనలు ఘోరీ సైన్యానికి చుక్కలు చూపెట్టాయి. దీంతో వారు ఏం చేసేది లేక బిక్కమొఖం వేసుకుని వెనుదిరిగారు. చౌహాన్‌పై పగ పెంచుకున్న ఘోరీ 1192లో మరోసారి యుద్ధానికి వచ్చి విజయం సాధించాడు. ఘోరీ సైన్యాన్ని ఘరిద్ సైన్యం అని కూడా పిలిచేవారు. రాజ్యవిస్తరణ కాంక్షతో యుద్ధాన్ని మొదలుపెట్టిన ఘోరీకి ప్రాణం పోయే పరిస్థితులు వచ్చాయి. యుద్ధంలో చౌహాన్ సేనలను నడిపించిన గోవింద్ రాయ్ ఘరిద్‌లను ఓడించడంలో సఫలీకృతం అయ్యాడు.
తోకముడిచిన ఘోరీ సేనలు
ఘోరీ మహ్మద్ ఆత్మవిశ్వాసంతో దాడి చేసినా.. పృథ్విరాజ్ చౌహాన్ ఎత్తులతో ఘోరీ సైన్యం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి తరైన్ యుద్ధానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆ సమయంలో ముఖ్యమైన కోటగా ఉన్న భఠిండా కోటను స్వాధీనం చేసుకునేందుకు ఘోరీ ప్రయత్నాలు చేశాడు. పృథ్విరాజ్ చౌహాన్ తన మిత్రుల సాయంతో సైన్యాన్ని సమీకరించి ఘోరీ సేనలను ఓడించాడు. ఢిల్లీకి ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరైన్ మైదానంలో ఈ రెండు రాజ్యాల సైన్యాలు ఒకరికొకరు తలపడ్డారు. పృథ్విరాజ్ చౌహాన్ యుద్ధానికి ముందే తన అనేక మంది స్నేహితులను ఒక్కచోటుకి చేర్చి సైన్యాన్ని పోగు చేశాడు.
దీంతో చౌహాన్ సైన్యం విపరీతంగా పెరిగింది. దీంతో పృథ్వి సేనలు తోకముడవక తప్పలేదు. పదాతిదళం, అశ్వకదళం మొదలయినవి గొప్ప పోరాటం చేసి ఘోరీ సేనలకు ఓటమిని మిగిల్చాయి. పృథ్విరాజ్ చౌహాన్ ఎదురుదాడికి ఘోరీ సైన్యం ఆశ్చర్యపోయింది. ఈ యుద్ధ సమయంలో మహ్మద్ ఘోరీకి దాదాపు ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. రాజు యుద్ధభూ మిని వీడటంతో సైన్యం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. దీంతో వారు ఓటమిని అంగీకరించారు. ఘరిద్ సైన్యం ఓడిపోయిన అనంతరం పృథ్విరాజ్ చౌహాన్ సేనలు వారిని దాదాపు 40 కిలోమీటర్లు తరిమేశారని చరిత్ర చెబుతోంది.
యుద్ధం లో ఓడిపోయిన అనంతరం ఘోరీ రాజ్‌పుత్‌లపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక ప్రణాళికలు రచించాడు. ఈ యుద్ధం ద్వారా భారత్‌పై కన్నేసిన ఘరిద్‌లు తర్వాత కూడా దాడులు చేశారు. శత్రువు బలాలు, బలహీనతలు తెలుసుకుని కొద్ది సమయం తర్వాత ఘోరీ మరోమారు దండయాత్రకు వచ్చాడు. దీంతో ఓడిపోవడం పృథ్విరాజ్ చౌహాన్ సేనల వంతయింది. మొదటి తరైన యుద్ధంలో రాజ్‌పుత్ సేనలకు గోవింద్ రాయ్ నాయకత్వం వహించాడు.