23-11-2025 01:06:09 AM
ఇటీవ లే ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో సినీ ప్రియుల మనసు దోచుకుంది రష్మిక మందన్న. ఈ చిత్రంలో ‘భూమా’ పాత్రలో తనదైన నటనతో అమ్మాయిలకు మరింత దగ్గరైందీ నేషనల్ క్రష్. ఇకపోతే రష్మిక తరుచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ సోసల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే, ఈసారి ఆమె స్త్రీ శక్తిపై స్పందించింది. “ఫెమినైన్ ఎనర్జీ’లో ఏదో ప్రత్యేకత ఉంది. దాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు.
కానీ, మనతో మనం నిజంగా కనెక్ట్ అయినప్పుడు పరిస్థితులను, వ్యక్తులను ఇట్టే అర్థం చేసుకోగలుగుతాం. ఏదైనా తప్పు జరగబోతోందని మనసు ముందే హెచ్చరిస్తుంది” అంటూ పోస్టు పెట్టింది. ‘మహిళలు ఒకరికొకరు అండగా నిలవడం, ఒకరి సమస్యలను మరొకరు ఓపికగా వినడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. వారి జీవితం మరింత సులభంగా మారుతుంది. ఈ స్త్రీశక్తిని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది.
ఇప్పుడు అర్థమైంది కాబట్టి, దీన్ని అన్నివిధాలా కాపాడుకుంటా. అమ్మాయిలు బలహీనమైనవారు కాదు.. వారెంతో బలవంతులు. అలాంటి శక్తితో మహిళలందరూ ఏకమైతే, వారిని ఎవరూ ఆపలేరు. మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప స్నేహితురాళ్లు ఉండాలని కోరుకుంటున్నా” అంటూ రాసుకొచ్చింది.
రష్మిక ప్రస్తుతం ‘మైసా’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను గోండు తెగల నేపథ్యంలో కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న భావోద్వేగభరిత యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో రష్మిక శక్తిమంతమైన ఆదివాసీ యువతిగా కనిపించనుంది. రష్మిక తొలిసారి యాక్షన్ పాత్ర పోషిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.