23-11-2025 01:08:22 AM
రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్
ముషీరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న అధ్యాపకులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి, క్రమబద్ధీకరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టర్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హాజరైన సామాజిక విశ్లేషకులు ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ గత పదేళ్లలో విద్యా రంగం తీవ్రంగా దెబ్బతిందని, ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాల పరిస్థితి శోచనీయంగా మారిందన్నారు.
గత 25 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ సభ్యు డు ప్రొ.పి.ఎల్. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై హయ్య ర్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్కు విద్యా కమిషన్ సవివర నివేదిక సమర్పించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిందేనని అన్నారు.
ట్రైకార్ చైర్మన్ డా.బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ అధ్యాపకులను విస్మరించిందని విమర్శించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డా.పరశురాం, కో-కన్వీనర్ డా.పాండయ్య, నాయకులు రాందాస్ నాయక్, డా.శేఖర్ రెడ్డి, డా.వెంకటేశ్వర్లు, డా. కవిత షిండే, డా.విజయ్ కుమార్, డా.రామక్రిష్ణయ్య, డా.సురేష్, డా.తిరుపతి, డా.ఖజా మోహినొయోద్దీన్, డా.ఓ.కృష్ణయ్య, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు పాల్గొన్నారు.