22-09-2025 12:00:00 AM
ఇంట్లో నేను దుఃఖంతో శ్వాసిస్తున్న
రోజు ఎంతకు కదలడం లేదు
చలికి ముసురుకున్న కుక్క పిల్లయింది
నాలో సెలయేళ్లుగా పారిన నదుల జీవం తాగి
మొలిచిన మొక్కలు పూలకు బదులు కంటకాలు పూస్తున్నాయి
నా అడుగులు వేసిన నాగలి సాళ్లలో చిగురు తొడిగిన
పంటలను కడుపారా భుజించిన ఆకలి తిత్తులు చేతులెత్తి
మొక్కెదిపోయి తిన్న తలెలు ఎత్తేస్తున్నయి
నా పేరు చెప్పుకొని కాలం కాలువలో ఈదిన వాళ్లు
ఒడ్డునెక్కి చెరువు నిండిన కప్పల్లా బెకబెకమంటున్నయ్
నమ్మకము అని నాతో నానిన
నాలుకలు విషం కక్కుతున్నయ్
కాలమే ఇట్లున్నదని కంటినిండా ఉప్పు నీళ్లు తాగి
దుఃఖంతో శ్వాసిస్తున్న దగ్గరికన్నా దూరమే
దగ్గర అనిపిస్తుంది ఇప్పుడు
మెత్తని మాటలు కంటిలో పడ్డ
రాళ్లలా గుండెకు గుచ్చుకుంటున్నాయ్
కన్నీళ్లను దోసిళ్లలో నింపుకొని
నా నమ్మకానికి రాసుకుంటున్న.