calender_icon.png 27 July, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌ను నమ్ముకుంటే ఉన్న గుడిసె పాయె

11-08-2024 06:46:01 AM

  1. సొంతూరు ప్రజలకు ఇళ్లు నిర్మించకుండా మోసం  
  2. తక్షణమే అధికారులు చింతమడకలో పర్యటించాలి 
  3. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తాం 
  4. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఇల్లు పీకి పందిరేసినట్టు మాజీ సీఎం కేసీఆర్ పనితనం ఉందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవాచేశారు. తన సొంతూరు చింతమడకలో ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్ల క్రితం  డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని పేదల ఇండ్లలన్నీ కూల్చివేసి, వారికి నిలువ నీడ లేకుండా చేశారని విమర్శించారు. దేశానికి దశ దిశ చూపిస్తామని ప్రగల్బాలు పలికిన మాజీ సీఎం.. ఉన్న ఊరోళ్లకే పంగనామాలు పెట్టారని ఆరోపించారు.

ఈ మేరకు శనివారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. చింతమడకలో ప్రతి ఒకరికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని 2019 జూలై 22లో ఆర్బాటంగా ప్రకటించారని, పెద్దసారు చేసిన ప్రకటనలు నమ్మి ప్రజలు తమ ఇళ్లను, గుడిసెలను సర్కార్‌కు అప్పగించారని తెలిపారు. నాడు అధికారులు లబ్ధిదారులను గుర్తించి 1,909 ఇళ్లను మంజూరు చేశారని అన్నారు. కానీ, గుత్తేదారులు 1,215 ఇళ్లు నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 694 ఇళ్లకు అగ్రిమెంట్ జరగలేదని, నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని, గత ఏడాది డిసెంబర్ నాటికి 1,103 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోడంతో 60 నుంచి 70 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. లబ్ధిదారులకు కేటాయించిన కొన్ని ఇళ్లకు తాళం చెవులు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయలేదని, చేసిన ఇండ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. నిరుపేదలకు నిలువ నీడ కల్పించడం ప్రభుత్వ కర్తవ్యమని, తొమ్మిదిన్నరేళ్లు పాలించిన నేతలు ప్రజలను విస్మరించారని, ఇందుకు నిదర్శనం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకేనని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు చేసిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు మాత్రమే రాష్ట్ర చరిత్రలో శిలా శాసనాలుగా నిలిచాయని స్పష్టంచేశారు. 

గత ప్రభుత్వం విస్మరించిన వారికి ఇళ్లు  

గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ నేతలంతా ఫామ్ హౌజ్‌లు కట్టుకుని పేదలకు మాత్రం ఇంటి సౌకర్యాన్ని విస్మరించారని పొంగులేటి ఆరోపించారు.  తమ ప్రభుత్వం వారికి కూడా ఇళ్లు కట్టిస్తుందని తెలిపారు. తక్షణమే చింతమడకలో పర్యటించి ఇళ్ల నిర్మాణానికి అవసర మైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా అక్కడ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.