calender_icon.png 17 November, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను మోసం చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే!

17-11-2025 01:31:41 AM

-రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

-డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై కాంగ్రెస్ ఒత్తిడి తేవాలి

-రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్

-హాజరైన మాజీ ఎంపీ వీహెచ్, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ 

ముషీరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ముందుకెళితే బీసీల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని, రాష్ట్రా న్ని అగ్నిగుండం చేస్తామని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి, ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యా ప్తంగా ‘రన్ ఫర్ సోషల్ జస్టిస్‘  పేరుతో 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో బీసీలు పెద్ద ఎత్తున రన్ నిర్వహించారు. 

ఇందులో భాగంగానే హైదరాబా దులో బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌లో గల అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రన్‌లో వందలాది మంది బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, చీఫ్ కో- ఆర్డినేటర్ గజ్జ కృష్ణ, కో -ఆర్డినేటర్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒక రాజకీయ కార్యచరణ నిర్ణయించుకుని డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు కేంద్రంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని సూచించారు. ఇండియా కూటమి ద్వారా పార్లమెంటును స్తంభింప చేయాలని, అఖిలపక్షంతో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానితో కలిసి ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.

ఇవి చేయకుం డా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటే బీసీలను నమ్మించి మోసం చేయడమే అవుతుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద వైఖరి విడనాడి పార్లమెంటు సమావేశాలలో చట్టాన్ని ఆమోదించకుంటే వేలాది మందితో చలో ఢిల్లీ నిర్వహించి పార్లమెంటు ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. 

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు : వీహెచ్

బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు అమలు కాకుం టే భవిష్యత్తులో ఇంకెప్పుడు అమలు జరిగే పరిస్థితి లేదని, బీసీ రిజర్వేషన్లపై బీజేపీతో కాంగ్రెస్ తరఫున పోరాడుతామని మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ వద్దని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలు ఆగిపోతే కేంద్రం నుండి రావలసిన నిధులు రావడం లేదని చెపుతున్న ప్రభుత్వం.. లక్షల కోట్ల బడ్జెట్లో రూ.3 వేల కోట్లు ఆగిపోతే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతే, బీఆర్‌ఎస్ పార్టీ కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందన్నారు.

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జేఏసీ చేస్తున్న ఉద్యమంతో కలిపి నడుస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేవరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో -ఆర్డినేటర్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు వీరస్వామి, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కుర్మ, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.