calender_icon.png 1 July, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ముంటే భూకబ్జా ఆరోపణలు నిరూపించాలి

01-07-2025 01:10:43 AM

కాంగ్రెస్ నాయకులకు బీఆర్‌ఎస్ సవాల్

హుస్నాబాద్, జూన్ 30 : కాంగ్రెస్ నాయకులు చేసిన భూకబ్జా ఆరోపణలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండించింది. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధులు ఐలేని మల్లికార్జునరెడ్డి, సుద్దాల చంద్రయ్య  నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనవసర విమర్శలు మానుకోవాలని, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.‘మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు దమ్ముంటే మీరు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించండి‘ అని సవాల్ విసిరారు. ఈ ఆరోపణలు నిరాధారమని, కాంగ్రెస్ అనవసర విమర్శలు మానుకోవాలన్నారు

సతీశ్ కుమార్ హయాంలో రూ. పది వేల కోట్ల అభివృద్ధి

బీఆర్‌ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలనేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ హయాంలో పది వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, సతీశ్ కుమార్ తీసుకువచ్చిన పది వేల కోట్ల రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే బీఆర్‌ఎస్ అభినందిస్తుందని తెలిపారు.

 కాంగ్రెస్ బెదిరింపులకు భయపడం

నాలుగు రోజుల క్రితం హుస్నాబాద్కు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాల కోసం వచ్చి, నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు, ‘ఇక్కడ సరిగా అభివృద్ధి పనులు జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం‘ అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని, దీనికి మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తమ హయాంలో జరిగిన పనుల గురించి వివరించారని మల్లికార్జునరెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆవేశంతో తమ నాయకునిపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

‘మీ హయాంలో చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పుకోండి. ప్రజల కోసం మాట్లాడే బీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. మీరు చేసే బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడదు‘ అని స్పష్టం చేశారు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ నాయకులపై విమర్శలు మానుకొని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా,  నాయకులు బొజ్జ హరీశ్, మేకల వికాస్, ప్రభాకర్ రెడ్డి, గడ్డం సదానందం, భూక్య రాజు, రాజేందర్ రెడ్డి, కందుకూరి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.