04-02-2025 12:00:00 AM
లైఫ్‌లో వివిధ పనుల్లో బిజీ అయి భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునే సమయం కూడా తగ్గింది. ఇదే కొనసాగితే వైవాహికబంధం బీటలువారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కింది చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు..
పనిలో ఎంత బిజీగా ఉన్నా భాగస్వామిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రేమగా ఓ పలకరింపు అవతలివారిని మీకు దగ్గర చేస్తుంది. ఆ రోజు మీ జీవితంలో ఏదైనా మంచి జ్ఞాపకంతో ముడిపడి ఉంటే మరోసారి గుర్తుకు తెచ్చుకోండి.
భాగస్వామితో మాట్లాడేటప్పుడు ముఖంలో ప్రశాంతతను చెరగనివ్వకండి. మీ పెదాలపై కనిపించే ఆ చిరునవ్వు అవతలివాళ్లని ఎంతటి సమస్య నుంచైనా బయటపడేలా చేస్తుంది.
ఇరువురూ కలిసి నచ్చిన వంటకం చేసుకుంటూ గత అనుభవాల గురించి మాట్లాడుకుంటే గంటలు కూడా నిమిషాల్లా గడిచిపోతాయి. అలాగే భాగస్వామి కబోర్డు సర్దుతూ ఆయా దుస్తుల వెనక ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటే మనసు ఆనందంతో నిండుతుంది.
అప్పుడప్పుడూ మీ ఆల్బమ్ తిరగేయండి. వేడి కాఫీ తాగుతూ ఆ ఫొటోల వెనక ఉన్న సంఘటనల గురించి ఒకరికొకరు చెప్పుకోవాలి.