11-09-2025 01:13:34 AM
-దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు హెచ్చరిక
-ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో బుధవారం విచారణకు హాజరుకాని వెంకటేశ్, రాణా, సురేష్, అభిరాం
-తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో నమోదైన క్రిమినల్ కేసులో తదుపరి విచారణకు టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గు బాటి రాణాతోపాటు నిర్మాత దగ్గుబాటి సురేష్, అభిరాం హాజరుకాకుంటే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని నాం పల్లి కోర్టు హెచ్చరించింది. ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ స్థలానికి సంబంధించి దాని యజమాని నందకుమార్‌కు, దగ్గుబాటి కుటుంబానికి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
ఈ వివాదంపై నందకుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సదరు స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని, ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ 2022 నవంబర్‌లో జీహెఎంసీ సిబ్బంది, బౌన్సర్ల సాయంతో దగ్గుబాటి సోదరులు హోటల్‌ను పాక్షికంగా కూల్చివేశారంటూ నందకుమార్ ఆరోపించారు. ఆ తర్వాత 2024 జనవరిలో హోటల్‌ను పూర్తిగా నేలమట్టం చేశారు.
దీంతో నందకుమార్ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. దగ్గుబాటి వెంకటేశ్, రాణా, సురేష్ బాబు, అభిరాంలపై క్రిమినల్ కేసులు నమో దు చేయాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే, కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి దగ్గుబాటి కుటుంబం ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. గత ఆగస్టు 1న, బుధవారం కూడా హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వారి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని, తదుపరి విచారణకు ఖచ్చితంగా హాజరవుతారని కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు విచారణను అక్టోబర్ ౧౬కు వాయిదా కోర్టు వాయిదా వేసింది.