29-10-2024 01:20:37 AM
జనగామ, అక్టోబర్ 28(విజయక్రాంతి): పైసా పైసా కూడబెట్టి పెట్టిన షాపు కళ్ల ముందే అగ్నికి ఆహుతవుతుంటే ఆ వ్యాపారి గుండెలవిసేలా రోదించాడు. కుటుంబమంతా ఆ షాపుపైనే ఆధారపడి జీవిస్తుం డగా అనుకోని ప్రమాదం కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ప్రమాదం సంభవించిన మరుసటి రోజే బాధిత వ్యాపారి తండ్రి గుండె ఆగింది.
ఒకవైపు షాపు దగ్ధమైందన్న బాధలో ఉన్న కుటుంబానికి పెద్ద దిక్కు మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. జనగామ పట్టణానికి చెందిన స్వర్గం లక్ష్మీనారాయణ(70)కు ఇద్దరు కుమారులు. రెండో కొడుకు స్వర్గం శ్రీనివాస్ మొదట్లో సైకిల్‌పై వస్త్రాలు అమ్ముతూ జీవనం సాగించాడు.
నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ఎన్నో సంవత్సరాలు వ్యాపారం చేసి పైసా పైసా కూడబెట్టి కొన్నేళ్ల క్రితం సిద్దిపేట రోడ్డులో ఓ షెట్టర్ అద్దెకు తీసుకున్నారు. ఎస్‌ఆర్ బ్రదర్స్ పేరుతో వస్త్ర దుకాణం తెరిచాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ షాపుపైనే ఆధారపడి కుటుంబం జీవిస్తోంది.
అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆదివారం ఓ షాపులో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. క్రమంగా అగ్నికీలలు శ్రీనివాస్ దుకాణాన్ని కబళించాయి. ఈ ఘటనతో శ్రీనివాస్ కుటుంబం విలపించింది.
ఈ బాధలో ఉండగానే శ్రీనివాస్ తండ్రి లక్ష్మీనారాయణ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సాయం చేసి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.