09-01-2026 12:26:52 AM
తుంగతుర్తి, జనవరి 8 : రోజురోజుకు పెరుగుతున్న దాడులు, ప్రమాదకర పరిస్థితులకు కారణమైన వ్యక్తులను తేలికగా గుర్తించడం కోసం చిన్న చిన్న గ్రామాలలో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణ సక్రమంగా లేని కారణంగా అవి కేవలం అలంకరణ ప్రాయంగా మారాయి. ఇదే పరిస్థితి ప్రస్తుతం తుంగతుర్తి మండల కేంద్రంలోనూ నెలకొంది.
పని చేయని సీసీలతో కష్టాలు..
గత కొంతకాలంగా తుంగతుర్తి పట్టణ కేంద్రంలో మెయిన్ రోడ్డు కూడలితోపాటు, పలు వీధుల్లో సైతం స్తంభాలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో, దొంగతనాలతో ప్రజలు కష్టాలు చవిచూస్తున్నారు. పోలీసులు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ నిఘా నేత్రాలు, ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో ఏం జరిగినా సీసీ కెమెరాలలో చూద్దామని వెళ్లేసరికి అవి పనిచేయడంలేధని తెలియడంతో ఇబ్బంది పడుకుంటూ వెళ్లాల్సి వస్తుంది.
పెరుగుతున్న దొంగతనాలు..
మండల కేంద్రంలో దవాఖాన నుంచి మెయిన్ రోడ్డు వరకు10 కి పైగా వివిధ షాపులు వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో పనిచేయటం లేదు. మెయిన్ రోడ్డుపై ఉన్న కొన్ని సీసీ కెమెరాలకి గతంలో పోలీస్ స్టేషన్ కి లింకు ఉన్నప్పటికీ, అవి కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఈ విషయాన్ని పసిగట్టి దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు తమ కార్యక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పోలీస్ అధికారులు ఒక సీసీ కెమెరా వందమంది పోలీస్ లతో సమానమని చెబుతున్నారు కానీ, ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తున్నట్లు విమర్శలు జోరుగా వస్తున్నాయి. ఏది ఏమైనా ఒక పక్క షాప్ యాజమాన్యం, మరొక ప్రక్క పోలీస్ అధికారుల కృషితో మెయిన్ రోడ్డుపై పూర్తిస్థాయిలో నిఘా నేత్రాలు పనిచేసేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే దొంగతనాలు జరిగిన, ఏవైనా ప్రమాదాలు జరిగినా కారకులను వారిని గుర్తించేందుకు ఈ నిఘా నేత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కావున అధికారులు వీటిపై దృష్టి సారించి వాటిని పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.
మెయిన్ రోడ్డు పై నిఘా నేత్రాలు ఏర్పాటుకు కృషి చేస్తాం
గత కొంతకాలంగా మెయిన్ రోడ్డు పై షాపుల యాజమాన్యం పెట్టుకున్న కెమెరాలు, పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. యాజమాన్యానికి కౌన్సిలింగ్ కూడా చేశాము. వైర్లు కెమెరాల రిపేరుతో కొన్ని స్టేషన్లో కూడా పని చేయడం లేదు. షాపు యజమానులు, దాతలు ముందుకు సహకారంతో ఉన్న కెమెరాలను రిపేర్లు చేయించడంతోపాటు కొత్త వాటి ఏర్పాటుకు కృషి చేస్తాం.
- క్రాంతి కుమార్, ఎస్త్స్ర, తుంగతుర్తి