22-12-2025 01:00:55 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్
తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా గద్వాల్ జిల్లాలో పర్యటించిన కవిత
అలంపూర్, డిసెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైద్యం మీద దృష్టి పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆమె గద్వాల జిల్లాలో పర్యటించారు. ముందుగా బీచుపల్లి లోని ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిని సందర్శించి అక్కడ రోగులతో ఆమె మాట్లాడారు. ఆసుపత్రులో నెలకొన్న సమస్యలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆస్పత్రి నిర్మించి మూడేళ్లు పూర్తవుతున్న పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరికరాలు లేక ఖాళీ రూములే దర్శనమిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న 15 జిల్లాలకు పోతే అక్కడ ఉండేటటువంటి అరకొర వసతులతోనైనా సరే ప్రభుత్వ డాక్టర్లు అయినా నర్సులు.. శానిటేషన్ సిబ్బంది అయినా .. వాళ్లకు ఉన్నటువంటి పరిమితులతో ఎంత వీలైతే అంత పేద ప్రజలకు సేవ చేస్తున్నారని కానీ ప్రభుత్వాలు మాత్రం వారికి అండగా నిలబడి పెద్ద ఎత్తున వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి అండగా నిలబడదామని ఆలోచన కనిపిస్తే లేదని దానివల్ల అల్టిమేట్ గా ప్రజలకే ఇబ్బంది ఏర్పడుతుందనే పరిస్థితిని మనం గమనిస్తున్నామని ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించి ఇప్పటివరకు కనీసం పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయలేదని తక్షణమే ముఖ్యమంత్రి ప్రభుత్వ హాస్పటల్స్ లో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే విధంగా దృష్టి సారించాల్సిన అవసరత ఎంతైనా ఉందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందకు వచ్చిన ఈ ముఖ్యమైన పట్టణం అలంపూర్ వంద పడకల ఆసుపత్రిపై ఎందుకు ముఖ్యమంత్రి సమీక్షించలేదని.. ఈ హాస్పటల్ లో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని ఎందుకు నియమించలేదని మండిపడ్డారు.రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయిన.. ఏ హాస్పిటల్స్ సందర్శించిన ఇబ్బందులు కనిపిస్తున్నాయని ప్రభుత్వం ఖచ్చితంగా హాస్పిటల్ పైన శ్రద్ధ పెట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రోగులకు అందించే మందులు, ఇతర పరీక్షలకు గద్వాలకు వెళ్లే దుస్థితి ఏర్పడుతుందని... తీసుకువెళ్లిన శాంపిల్స్ ఫలితాలు రావడానికి రెండు మూడు రోజులు టైం పడుతుందని తద్వారా రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాబట్టి కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఆస్పత్రిలోనే అందుబాటులోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గొంగళ్ల రంజిత్ కుమార్ నాయకులు పాల్గొన్నారు.