11-11-2025 06:29:00 PM
డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్..
నకిరేకల్ (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం నకిరేకల్‌లోని నర్రా రాఘవ రెడ్డి భవన్‌లో ఆ సంఘం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ "కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగి, యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "యువత ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, పెండింగ్‌లో ఉన్న, పూర్తిస్థాయిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాల కల్పన, భర్తీపై పాలకులు దృష్టి పెట్టకపోతే, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతను ఐక్యం చేసి, తమ హక్కుల సాధన కోసం ఉధృతంగా పోరాటాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గద్దపాటి సుధాకర్, నాయకులు దాసరి శంకర్, మల్లేష్, శివ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.