calender_icon.png 12 December, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యంపై ప్రభావం!

07-12-2025 12:00:00 AM

మానవాళికి వరంలా అందివచ్చినవే యాంటీబయాటిక్స్. విచ్చలవిడి, విచక్షణారహిత వినియోగం కారణంగా యాంటీబయాటిక్స్ తమ శక్తిని కోల్పోతున్నాయి. వైద్యుల సిఫార్సులకు విరుద్ధంగా ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ మందులు వేసుకుంటున్న ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎక్కువ మంది జలుబు, దగ్గు, గొంతునొప్పికి అజిత్రోమైసిన్ వాడడం అలవాటుగా మారిపోయింది.

అప్పటినుంచే యాంటీబయాటిక్స్ వాడకం క్రమంగా పెరిగిపోయింది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా యాంటీబయాటిక్స్ మందులు అధికంగా వినియోగిస్తున్నారు. కొంతమంది ఆర్‌ఎంపీలు వద్ద తీసుకుం టుంటే.. మరికొంత మంది నేరుగా మందుల దుకాణాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. అయితే ఇన్‌ఫెక్షన్ల నియంత్రణకు వాడే యాంటీబయాటిక్స్ చాలా విలువైన ఔషధాలు. యాంటీ బయాటిక్స్‌ను విచ్చలవిడిగా  వాడితే దీర్ఘకాలంలో అది యాంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)కు దారితీసే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి 300 మందిపై అధ్యయనం చేయగా.. 83 శాతం మందిలో ఏఎంఆర్ కనిపించడం గమనార్హం. ఈ అధ్యయనం ఇటీవల జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా మన దేశంలో అలాంటి బ్యాక్టీరియాల బారిన పడినోళ్లు ఎక్కువగా ఉన్నారని ఏఐజీ స్టడీ హెచ్చరికలు జారీ చేసింది. ఏఐజీ స్టడీలో భాగంగా భారత్‌తో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్ చెందినవారి శాంపిళ్లను పరీక్షించగా అందులో మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లు మన దేశ రోగుల్లోనే అధికంగా ఉండగా.. 31.5 శాతంతో ఇటలీ తర్వాతి స్థానంలో ఉంది.

ఏఎంఆర్ కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు రోగికి యాంటి యాంటీబయా టిక్స్ రెసిస్టెన్స్‌పై ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాల్సిన అవసరముంది. కామన్ చెకప్‌లకు వస్తున్న వారిలోనూ హైఎండ్ మందులకు లొంగని బ్యాక్టీరియా ఆనవాళ్లు పెరిగిపోతున్నాయి. ఈ బ్యాక్టీరియా మన వాతావరణంలోకి చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవు.

కానీ ఈ విషయం తెలియక చాలా మంది విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ను తీసుకోవడం జరుగుతుంది. ఇది మన రోగ నిరోధక వ్యవస్థకు చాలా ప్రమాదకరం. తరచూ యాంటీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియాతో పోరాడే మన శరీరంలోని నిరోధక శక్తి సామర్థ్యం క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లలో మాత్రమే పనిచేస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.

వైరల్ వ్యాధులకు కూడా యాంటీబయాటిక్స్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల , మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచే మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల ప్రస్తుతం చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లకూ కూడా సరైన చికిత్స అందించలేని రోజులు వచ్చే ప్రమాదం ముంచుకొస్తున్నది. దేశవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది.యాంటీబయాటిక్స్ వాడడంపై ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరముంది.