calender_icon.png 6 July, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోపాటు వారికి ఇష్టమైన కళల పట్ల మక్కువ పెంచండి

03-07-2025 12:00:00 AM

ఐటీడీఏ పీఓ రాహుల్ 

భద్రాచలం, జూలై 2 (విజయ క్రాంతి); గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు వారికి ఇష్టమైన కళల పట్ల మక్కువ కలిగించి, వారిలో దాగివున్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల పరిసరాలు తరగతి గదులు లైబ్రరీ రూము విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలను ఆయన పరిశీలించారు.

ముందుగా మూడో తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఇంగ్లీష్ పదాలను బోర్డుపై వ్రాయించి వాటి అర్థాలను తెలుగులో చెప్పించుకున్నారు. అనంతరం 6 నుండి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్న క్లాసులను ఉపాధ్యాయులు బోధిస్తున్న బోధనా తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు వారికి అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ పదాలను వారి చేత బోర్డుపై రాయించి వాటి అర్థాలను తెలుగులో పూర్తిగా చెప్పేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ఈ సంవత్సరం ప్రతిరోజు బోధించే పాఠ్యాంశాలతో పాటు అదనంగా విద్యార్థులకు ఇష్టమైన వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయానికి సంబంధించిన కళల పట్ల అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వాటికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించి అన్ని పాఠశాలలకు పంపిస్తామని ఉపాధ్యాయులు తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

వర్షాకాలం నడుస్తున్నందున విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, విషపూరితమైన క్రిమి కీటకాలు సంచరిస్తూ ఉంటాయని కనుక రాత్రిపూట విద్యార్థులు ఎవరు బయటకు రాకుండా చూడాలన్నారు.ప్రతిరోజు వంటగది శుభ్రం చేసి మెనూ ప్రకారము విద్యార్థులకు వేడిగా ఉన్న ఆహారాన్ని వడ్డించాలని అన్నారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండేలా చూడాలని, పాఠశాల చుట్టూ వర్షపు నీరు నిలవకుండా సైడ్ డ్రైన్లు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం నరసింహారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.