calender_icon.png 26 August, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసక వెలుతురులో..

26-08-2025 01:45:58 AM

మాదారంలో లో ఓల్టేజీ సమస్య 

-గ్రామప్రజల ఇబ్బందులు

-మీటర్లు పెరుగుతున్నా..

-పెరగని ట్రాన్స్‌పార్మర్లు 

-కాలిపోతున్న ఎలక్ట్రానిక్ వస్తువులు

గుమ్మడిదల, ఆగస్టు 25 : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం గ్రామస్తులకు శాపంగా మారింది. దీంతో మసక చీకటిలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామం అభివృద్ధి చెందు తూ గృహాల మీటర్లు పెరుగుతున్నా వాటికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంలో విద్యుత్ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో లో ఓల్టేజీ సమస్య ఏర్పడి టీవీలు, ఫ్రిడ్జ్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయి.

దీంతో తీవ్ర ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. గడ్డపోతారం పరిధిలోని మాదారం గ్రామంలో లో వోల్టేజీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం రోజురోజుకు విస్తీర్ణం పెరుగుతుంది. మీటర్లు పెరిగాయి. కానీ ట్రాన్స్ఫార్మర్లను పెంచడం మరిచారు. ఈ సమస్య ముఖ్యంగా రామాలయం టెంపుల్ ఎదురుగా ఉన్న వినియోగదారులు ఇబ్బందులకు గురవుతు న్నారు. 

విద్యుత్ అంతరాయాలు, తరచుగా కరెంట్ హెచ్చుతగ్గులతో వినియోగదారుల గృహోపకరణాలైన టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీలు, రైస్ కుక్కర్లు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సింది పోయి అసలు పట్టింపే లేకుండా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నా సరిగా స్పందించడం లేదని, రకరకాల కారణాలు చెబుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు.

డిమాండ్కు సరిపడా కరెంట్ లేనప్పుడే ఇటువంటి లో వోల్టేజీ సమస్యలు వస్తాయని, ట్రాన్స్ఫార్మర్లపై పెరిగిన భారాన్ని గుర్తించి, అక్కడ అదనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని లేదా ఆ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచడమో చేయాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే లోవోల్టేజీ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. ఏఈ, డిఈ  స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులుకోరుతున్నారు.