26-08-2025 01:43:59 AM
-ఒంటరి స్త్రీ పురుషులకు నేటికి దక్కని ప్యాకేజీలు
-కోర్టు ఆదేశించినా పట్టించుకోని అధికారులు
-సాయం కోసం కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితుల ఎదురు చూపులు
గజ్వేల్, ఆగస్టు 25 : ప్రాజెక్టుల నిర్వాసితులు ప్యాకేజీల కోసం ఇంకా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణంలో భూ నిర్వాసితులైన కుటుంబాల పరిహారం ప్యాకేజీలు ప్లాట్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులలో భూ నిర్వాసితులైన కుటుంబాలలో పెళ్లయిన వారికి, యువతి యువకులతో పాటు గత ప్రభుత్వం ఒంటరి స్త్రీ, పురుషులకు కూడా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చి ముంపు గ్రామాలను ఖాళీ చేయించారు. కానీ ఇప్పటివరకు ఒంటరి స్త్రీ, పురుషులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కానీ, ఇల్లు కానీ ఇవ్వలేదు.
తమకు ప్యాకేజీలు రాలేదని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్, వేముల గట్టు గ్రామానికి చెందిన 80 మంది కోర్టును ఆశ్రయించగా 2023లో ప్రభుత్వం అన్ని కుటుంబాల మాదిరిగా ఒంటరి స్త్రీ, పురుషులను కుటుంబాలుగా గుర్తించి పరిహారం ప్యాకేజీలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు 80 మందికి ప్యాకేజీలు, ప్లాట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నా ఇప్పటివరకు అమలు చేయలేదు.
ఒంటరి స్త్రీ, పురుషులకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు చెందిన వేములఘట్ 36, ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన 57 మంది ఒంటరి స్త్రీ, పురుషులు తమకు పరిహారం అందించాలని 2024 లో కోర్టును ఆశ్రయించగా, వారికి కూడా ప్యాకేజీలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. వీరు కాక మరో 295మంది ఒంటరి స్త్రీ, పురుషులు ప్యాకేజిలు రాని వారున్నారు.
వీరికి కూడా కోర్టుకు వెళ్లిన వారిలాగే ప్యాకేజిలు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒంటరి స్త్రీ, పురుషులకు పరిహారం ప్యాకేజీలు ఇవ్వలేదు. దీంతో కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఒంటరి మహిళలు, పురుషులు సొంత ఇల్లు లేక ప్యాకేజీ డబ్బులు రాక తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు పరిహారం అందించాలని కోరుతున్నారు.
మాకూ పరిహారం ఇవ్వండి సారు...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్లన్న సాగర్ నిర్వాసితుల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినారు. మాకు పరిహారం రాక ఇబ్బంది పడుతున్నాము. అప్పుడు అందరికీ ఇస్తామని చెప్పిన సార్లు ఊర్లో ఇండ్లు ఖాళీ చేపించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. నాకు రావలసిన ప్యాకేజీలు డబ్బులను ఇప్పించాలి.
జూకంటి సిద్ధమ్మ, లక్ష్మాపూర్.
ఇంకా ఎన్నేళ్లు ఓపిక పట్టాలి..
ఊర్లు ఖాళీ చేయమనగానే చేసి అధికారులను నమ్మి వచ్చాము. ఊర్లు విడిచిపెట్టి ఐదేళ్లు అయినా కూడా ఇల్లు ప్యాకేజీలు ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కష్టాలు తీరుతాయని చెప్పారు. ఇంకా ప్యాకేజీలు మాత్రం ఇవ్వడం లేదు. నా లెక్క చాలామంది ఉన్నారు. వారందరికీ వెంటనే ప్యాకేజీలు ఇవ్వాలి.
నరసయ్య, ఏటిగడ్డ కిష్టాపూర్