10-12-2025 01:46:29 AM
ఇప్పటికే షారుఖ్‌ఖాన్‌తో ‘కింగ్’, అల్లు అర్జున్-అట్లీ సినిమాల్లో నటిస్తుంది బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పడుకొణె. అయితే, ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో ప్రాజెక్టులో భాగమైనట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అమర్ కౌశిక్ ‘స్త్రీ2’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ‘మహావతార్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కథానాయికగా దీపికాను ఎంపిక చేసుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పరశురాముడి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఆ పాత్రకు ఆమె నూరు శాతం న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ బలంగా విశ్వసిస్తోందట. అందుకే ఆమెను తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి సంప్రదింపులు జరుపగా దీపికా ఓకే చెప్పినట్టు భోగట్టా.
పని గంటల విషయంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తూ ‘కల్కి2’ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు దూరమైంది దీపికా. ఇదేమీ ఉద్యోగం కాదు.. నటీనటులు వర్కింగ్ అవర్స్ విషయంలో పట్టువిడుపుగా ఉండాలన్న అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తమైంది. అంత కచ్చితంగా ఉంటే నష్టం దీపికకే అంటూ ఆమెను విమర్శించినవారూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బంపర్ ఆఫర్ తాజాగా దీపికా తలుపు తట్టడం సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోంది.