నందిగామ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

27-04-2024 02:16:14 AM

l తృటిలో తప్పించుకున్న కార్మికులు

l 17 ఏళ్ల బాలుడి సాహసంతో ౪౦ మంది సురక్షితం 

l ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, డీసీపీ

షాద్‌నగర్, ఏప్రిల్ 26: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామలోని అలైన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ గా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ౧౭ ఏండ్ల బాలుడి సాహసంతో కార్మికులు సురక్షితం గా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. అలైన్ పరిశ్రమలో ఓ కార్మికుడు వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న థర్మాకోల్, ఫ్లువుడ్ షీట్లపై పడి మంటలు రాజుకున్నాయి. అక్కడే ట్యాబ్లెట్ల తయారీకి సబంధించిన 15 ఆల్కాహాల్ డ్రమ్ములు ఉండటంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.

క్షణాల్లోనే పరిశ్రమ మొత్తానికి మంటలు వ్యాపించాయి. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయిదు ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాద సమయంలో కంపనీలో 100 మందికి పైగా కార్మికులు విధుల్లో ఉన్మారు. మంటలకు అప్రమత్తమైన వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీయగా మరికొంతమందిని నిచ్చెనల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. దట్టమై న పొగల మధ్య ఐదుగురు సిబ్బంది ఇరుక్కుపోయారు. అందులో ఉన్న చారి అనే ఉద్యోగి భయబ్రాంతులకు గురై కిటికీ నుంచి కిందికి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

పరిశ్రమకు చేరుకున్న ఎమ్మెల్యే, డీసీపీ

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హుటాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకుని కార్యకర్తలతో కలసి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రాణనష్టం వాటిల్ల కుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీయడంతో పాటు కార్మికులకు దైర్ఘ్యం చెప్పారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి పరిశ్రమ వద్దకు చేరుకుని సహయక చర్యలను పర్యవేక్షించారు.  

శభాష్ సాయి

పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తన మిత్రుడి తల్లి కోసం అక్కడికి వెళ్లిన 17 ఏండ్ల సాయిచరణ్  ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. ప్రమాదాన్ని గ్రహించిన సాయి భవనంపైకి ఎక్కి తాడు బిగించి కిటికీ ద్వారా పరిశ్రమలో ఉన్న 40 మంది కార్మికులను కిందకి దించాడు. చిన్న వాడైనా సాయి చరణ్ ధైర్యాన్ని అక్కడున్న వారు అభినందించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. సాయిచరణ్‌ను అభినందించి రూ.10 వేల బహుమతిగా ఇవ్వబోగా.. అందుకు ఆ బాలుడు నిరాకరించాడు. తన స్నేహితుడి తల్లి పరిశ్రమలో పనిచేస్తుందని ఆమెకోసం ఇక్కడికి వచ్చానని చెప్పాడు.